వాల్తేర్ వీరయ్య మూవీ రివ్యూ
గాడ్ ఫాదర్ సినిమాతో మెగా స్టార్ చిరంజీవి మళ్ళీ గాడిన పడిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో ముందుకు వచ్చారు. బాబీ డైరెక్షన్..దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటు పూనకాలు లోడింగ్ అంటూ సినిమాపై బాగా అంచనాలు పెంచారు. గతంలో ఎప్పుడూ లేని తరహాలో ఒకే నిర్మాణ సంస్థ కు చెందిన రెండు పెద్ద సినిమాలు ఒక్క రోజు తేడాతో థియేటర్లలో సందడి చేశాయి. అందులో ఒకటి వీరసింహారెడ్డి అయితే..మరొకటి వాల్తేర్ వీరయ్య. దీనితో రెండు పెద్ద సినిమాలు విడుదల అయినట్లే. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే చిరంజీవి జాలరిపేటలో ఉంటూ చేపలు పట్టడం తో పాటు పలు వస్తువులు విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ఒక టీం ఉంటుంది. దీంతో పాటు ఒక ఐస్ ఫ్యాక్టరీని కూడా నడుపుతారు. చివరకు నేవీ వాళ్ళు కూడా తమ వాళ్ళను ఎవరైనా కిడ్నాప్ చేస్తే వీరయ్య సాయం తీసుకుంటారు. సినిమా ప్రారంభం ప్రారంభమే ఒక విమానం క్రాష్ ల్యాండింగ్ తో స్టార్ట్ అవుతుంది. అందులో ఒక పేరుమోసిన డ్రగ్ డీలర్ ఉంటాడు. పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి ఈ డీలర్ ను ఉంచుతారు అయితే అక్కడ ఉన్న పోలీస్ లు అందరినీ చంపి బయటకుపోతాడు. అక్కడ ఇంచార్జి గా ఉన్న పోలీస్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఒక ఒప్పందం చేసుకుని వాల్తేర్ వీరయ్య అండ్ టీంను మలేసియా తీసుకెళతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది, మలేసియా వెళ్లిన వాల్తేర్ వీరయ్య తన పని పూర్తి చేశాడా లేదా అన్నదే ఈ సినిమా.
ఈ సీరియస్ సినిమాలో చిరంజీవి కామెడీనే హై లైట్ గా నిలిచింది. ఇందులోని స్టోరీ లైన్ కూడా ఇప్పటికే పలు సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే చిరంజీవి స్టోరీ ని నడపటంతో పాటు కామెడీ బాధ్యతను కూడా ఆయనే తీసుకున్నారు. అక్కడక్కడ వెన్నెల కిషోర్ కాస్త నవ్వులు పూయించాడు. ఉండటానికి శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ చాలామంది ఉన్నా కామెడీ అంతా చిరంజీవే చేశారు. హీరోయిన్ శృతి హాసన్ రోల్ ఈ సినిమాలో కూడా ఏదో ఉంది అంటే ఉంది అన్నట్లే. పాటలకు..కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఆమెకు జోడించారు. ఈ సినిమా లో ఉన్న మరో హీరో రవి తేజ పాత్ర సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది. రవితేజ కు జోడిగా నటించిన కేథరిన్ ట్రెసా పాత్ర కూడా పరిమితమైన రోలే. చిరంజీవి తనకు అలవాటైన పాత్ర కావటం తో అలవోకగా చేశారు చిరంజీవి లుక్ దగ్గర నుంచి, ఇద్దరు హీరోల మధ్య వచ్చే డైలాగులతో ముఠా మేస్త్రితో పాటు చాలా పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. మొత్తంమీద చూస్తే వాల్తేర్ వీరయ్య ఒక మాస్ ఎంటర్ టైనర్ మాత్రమే. అంతే కానీ చిత్ర యూనిట్ చెప్పినట్లు ఇందులో పూనకాలు లేవు...లోడింగ్ లేదు అని మాత్రం చెప్పొచ్చు.
రేటింగ్: 3 -5