'వలీమై' మూవీ రివ్యూ
తమిళ్ స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. అజిత్ సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఆయన హీరోగా నటించిన వలీమై సినిమాలో టాలీవుడ్ కు చెందిన యువ హీరో కార్తికేయ కూడా నటించారు. అది కూడా ప్రతినాయకుడి పాత్రలో. దీంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మరింత పెరిగింది. కార్తికేయ గతంలోనూ నాని సినిమా గ్యాంగ్ లీడర్ లో విలన్ గా కన్పించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదలకు ఒక రోజు ముందు వలీమైను థియేటర్లలో విడుదల చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ కు జోడీగా హ్యూమా ఖురేషీ నటించింది. అయితే ఈ సినిమా అంతా యాక్షన్ సన్నివేశాలే తప్ప...లవ్, కామెడీ వంటివి ఎక్కడా కన్పించవు. ఇక సినిమా అసలు కథలోకి వస్తే విశాఖ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా, దొంగతనాలు, హత్యలు చేసే గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఈ పనులు అన్నీ చేసేది ఒకే గ్యాంగ్. అందులో ముఖ్యంగా బైకర్స్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఎలాంటి ఉద్యోగం రాకపోవటం..కుటుంబ సభ్యులు, బందువుల నుంచి వచ్చే ఇబ్బందులు ఎదుర్కోలేక ఏదో ఒక ఉద్యోగం అని డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ లో చేరే యువత.
ఈ మాఫియా గ్యాంగ్ చేధింజే పోలీసు అధికారి పాత్రలో అజిత్. చివరకు అజిత్ తమ్ముడు కూడా ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం రాక ఈ గ్యాంగ్ లో చేరతాడు. ఈ గ్యాంగ్ ను అజిత్ ఎలా ఆట కట్టించాడు...అజిత్ ఎత్తులకు విలన్ గా కార్తికేయ ఎలాంటి పై ఎత్తులు వేశాడు అన్నదే వలీమై సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో హైలెట్ ఏదైనా ఉంది అంటే అజిత్, కార్తికేయలు బైక్స్ తో చేసే స్టంట్స్ తప్ప..మిగతా ఏమీ అంతా ఆసక్తికరంగా అన్పించదు. ఈ బైకర్స్ గ్యాంగ్ చేసే చైన్ దొంగతనాలు..హత్యలు కూడా ఒకింత భయంకరంగా తెరకెక్కించారు. విలన్ గా కార్తికేయ తన లుక్ తో, రకరకాల టాటూలతో ఆకట్టుకున్నాడు కానీ..పాత్రలో అంత బలం ఉన్నట్లు కన్పించదు. బైక్ స్టంట్స్ తప్ప..సినిమా కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు. బైక్ స్టంట్స్ కూడా ఎక్కువ భాగం ఫస్టాఫ్ లోనే సందడి చేస్తాయి. సెకండాఫ్ లో అది కూడా ఉండదు. అజిత్ పోలీసు అధికారి పాత్రలో సెటిల్డ్ గా కన్పిస్తాడు. ఓవరాల్ గా చూస్తే బైక్ స్టంట్స్ సమయంలో తప్ప సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు అసహనానికి గురవుతారు.
రేటింగ్.2-5