Telugu Gateway
Movie reviews

'వకీల్ సాబ్' మూవీ రివ్యూ

వకీల్ సాబ్ మూవీ రివ్యూ
X

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్ 'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కూడా తన రాజకీయాలకు ఒకింత వాడుకున్నాడనే చెప్పాలి. ఇందులోని పాటలు కొన్ని అసలు సినిమా కోసం అంటే పార్టీ కోసమే రాశారా అన్న చందంగా సాగాయి. ఇది బాలీవుడ్ 'లో సూపర్ హిట్ అయిన 'పింక్' సినిమాకు రీమేక్ అనగానే కథ గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏమీ ఉండవనే విషయం ముందే తేలిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ కు సరిపడేలా అసలు కథలో మార్పులు, చేర్పులు చేయటంలో దర్శకుడు వేణు శ్రీరామ్ బాగానే స్వేచ్చతీసుకుని ముందుకు సాగారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పక్కాగా డిజైన్ చేశారు. అయితే ఒరిజినల్ పింక్ సినిమా చూసిన వారికి మాత్రం ఇందులో తేడా స్పష్టంగా కన్పిస్తుంది. అయితే పింక్ చూడని వారికి మాత్రం ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా కొంత కొత్తదనం చూపిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సింపుల్ గా చెప్పాలంటే ముగ్గురు అమ్మాయిలకు ఎదురైన సమస్యను...వకీల్ సాబ్ ఎలా పరిష్కరించాడు అన్నదే సినిమా. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం కోర్టు సీన్స్‌ . కోర్టు సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి.

'అడుక్కునోళ్లకి అన్నం దొరుకుంది. కష్టపడినోడికి నీడ దొరుకుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదు', 'ఆడది అంటే బాత్రుంలో ఉండే బొమ్మ కాదు నిన్ను కన్న అమ్మ' లాంటి డైలాగ్స్‌ టచ్ చేస్తాయి. అయితే సెకండాఫ్‌ మొత్తం కోర్టు సన్నివేశాలే ఉండడం పవన్‌ ఫ్యాన్స్‌ కు నచ్చినా.. సాధారణ ప్రేక్షకుడికి ఎంత వరకూ కనెక్ట్ అవుతుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సూపర్ గా ఉంది అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాకు తొలిసారి పనిచేసిన తమన్ తనకు దక్కిన అవకాశాన్ని వంద శాతం ఉపయోగించుకున్నారు. తమన్ తన నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్ పెంచాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్‌ పర్పెక్ట్ గా సెట్ చేశాడు. ఈ సినిమాలో శ్రుతీహాసన్‌, పవన్‌ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్‌ సీన్స్‌ మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. ఓవరాల్ గా చూస్తే 'వకీల్ సాబ్ ' కేసు గెలిచినట్లే.

రేటింగ్. 3.25/5

Next Story
Share it