Telugu Gateway
Movie reviews

వారసుడు మూవీ రివ్యూ

వారసుడు మూవీ రివ్యూ
X

తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా ప్రారంభం నుంచి వివాదాల చుట్టూనే తిరుగుతోంది. తెలుగులో షూటింగ్ లు అన్నీ ఆపేసిన వేళ చిత్ర నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమా షూటింగ్ ఆపలేదు. పైగా ఇది తెలుగు సినిమా కాదు...తమిళ సినిమా కాబట్టే ఆపలేదు అంటూ సమర్ధించుకున్నారు. ఈ సినిమా విడుదల విషయంలోనే అదే సమస్య ఎదురైంది. ఇదే దిల్ రాజు ఒకప్పుడు సంక్రాంతి పండగకు తెలుగు సినిమాలకే ప్రాధానత్య ఇవ్వాలంటూ కోరారు. కానీ తాను నిర్మాతగా తెరకెక్కించిన వారసుడు దగ్గరకు వచ్చే వరకు మాట మార్చి ఇది వ్యాపారం...దమ్ము ఉన్న సినిమాలే నిలబడతాయి అంటూ మరో కొత్త వాదన తీసుకొచ్చారు. కానీ లోపలలోపల ఏమి ఒత్తిడి పనిచేసిందో కానీ దిల్ రాజు తన వారసుడు విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అందుకే ఫస్ట్ బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి, తర్వాత చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్య ల విడుదల తర్వాత శనివారంనాడు అంటే జనవరి 14 న ఈ సినిమా విడుదల అయింది. ఇద్దరు తెలుగు పెద్ద హీరోలు...పెద్దఎత్తున ఫాన్స్ బేస్ ఉన్న హీరో ల తర్వాత విజయ్ వారసుడు రావటం తో ఈ సారి దిల్ రాజు కు దెబ్బ తప్పేలా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక వారసుడు సినిమా కథ విషయానికి వస్తే ఒక పెద్ద వ్యాపార కుటుంబాన్ని నడిపిస్తారు శరత్ కుమార్, అయన కొడుకులే విజయ్, శ్రీకాంత్, శ్యామ్ లు .

శ్రీకాంత్, శ్యామ్ లు తండ్రి శరత్ కుమార్ మాట ప్రకారం సొంత బిజినెస్ లు చూసుకుంటుంటే విజయ్ మాత్రం తండ్రి చెప్పే మాటలు వినకుండా బయటకు వెళ్లి సొంతంగా ఒక స్టార్ట్ అప్ ప్లాన్ చేస్తాడు. మరి ఇంతటి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఎవరి చేతిలో పెడతారు...తండ్రితో విభేదించి బయటకు వెళ్లిన విజయ్ వారసుడుగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా. ఇందులో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ వ్యాపార సంస్థల మధ్య పోటీ...ఎత్తులు పైఎత్తులు వంటి రొటీన్ అంశాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా చూస్తుంటే చాలా వరకు మహేష్ బాబు హీరో గా నటించిన శ్రీమంతుడులో చాలా సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. దర్శకుడు వంశి పైడిపల్లి ఏ మాత్రం కొత్తదనం లేని కథ తో ప్రేక్షకులపై ఒక ప్రయోగం చేసినట్లే కనిపిస్తుంది. నిర్మాత దిల్ రాజు మాత్రం తమ సినిమా లో కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయని తమకు దీనిపై ఎంతో నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం అవేమి కనిపించవు అనే చెప్పాలి. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన రొటీన్ కథకే ..కొంత సెంటిమెంట్ జోడించి సినిమా ను ముగించారు. హీరో విజయ్ లుక్స్ అక్కడక్కడా స్టైలిష్ గా ఉన్నాయి. రష్మిక మందన్న పాత్ర మాత్రం ఈ సినిమా లో చెప్పుకోవటానికి ఏమిలేదు. ఈ సినిమా లో భారీ తారాగణం ఉన్నా కథలో దమ్ము లేకపోవటంతో పూర్తిగా తేలిపోయింది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఈ వారసుడు చాలా వీక్.

రేటింగ్.2 .5 -5

Next Story
Share it