'టక్ జగదీష్' మూవీ రివ్యూ
నాని సినిమా తొలిసారి వివాదాల్లో బాగా నలిగింది. ఈ వివాదం కంటెంట్ కు సంబంధించో..పేర్లకు సంబంధించో కాదు. సినిమా ఎక్కడ విడుదల చేయాలి అనే విషయంలో. చిత్ర నిర్మాతలు 'టక్ జగదీష్' మూవీని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించటంతో ఎగ్జిబిటర్లు హీరో నానితో సహా చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయినా సరే నిర్మాతల నిర్ణయం మేరకు టక్ జగదీష్ సినిమా గురువారం రాత్రి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అయింది. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే 'కొంత మందికి కులాల పిచ్చి. కొంత మందికి డబ్బు పిచ్చి ఉంటుంది. మా వాడికి ఫ్యామిలీ అంటే పిచ్చి' ఇది సినిమాలో డైలాగే అయినా సినిమా కూడా ఇదే. భూదేవిపురం అనే ఊరు. ఆ ఊరిలో ఉన్న భూ వివాదాలు. ఓ ఉమ్మడి కుటుంబం. అందులో విభేదాలు. క్లైమాక్స్ లో కలయిక. ఎప్పటిలాగానే ఊరిలో ఉండే విలన్ ల్యాంటి క్యారెక్టర్...హీరో ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తులు ఓ పారిశ్రామికవేత్తకు అప్పగించి వాటితో ప్రయోజనం పొందాలనే ప్రయత్నాలు. ఇలాంటి కథలు పాత సినిమాల్లో చూసీ చూసీ ఉన్నవే. కాకపోతే కథ చెప్పిన విధానమే కాస్త మారింది. మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగిన సినిమాలో హీరో నాని ఎమ్మార్వోగా అదరగొట్టాడనే చెప్పాలి. నాని ఎమ్మార్వో అయితే..హీరోయిన్ రీతూవర్మ వీఆర్ వో. వీరిద్దరి లవ్ ట్రాక్ ఏదో అతికించినట్లు కాకుండా పర్పెక్ట్ గా సెట్ అవుతుంది. నాని ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చే సీన్ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. అంతే కాదు సినిమా కథ కూడా అక్కడ నుంచే స్పీడ్ పెరుగుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ అత్యంత కీలకపాత్ర పోషించారు.
ఇందులో ఆమె తన సత్తా చాటారు. టక్ జగదీష్ పాత్రలో నాని అదరగొట్టాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవటమే మైనస్ అయినా...తన నటన ద్వారా ఆ లోటు లేకుండా చేశాడు. ఉమ్మడి కుటుంబంలో పెద్ద అన్నయ్యగా జగపతిబాబు తన పాత్రలో వేరియేషన్స్ చూపించాడు. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాలు చేసిన శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే నానిని ఈ సినిమాలో కొత్తగా చూపించటంతోపాటు..పాత కథను ఒకింత కొత్తగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. సినిమాలో కాస్త కామెడీ ఎక్కడైనా ఉంది అంటే తనను వేధిస్తున్న ఎమ్మార్వోను కొట్టడానికి వీర్ వో అయిన రీతూ వర్మను తీసుకెళ్లే సమయంలో వచ్చే సన్నివేశాలు..రీతూ వర్మ ఇచ్చే పంచులు నవ్విస్తాయి. నాని, రీతూవర్మల కాంబినేషన్ కూడా ఆకట్టుకుంది. ఓవరాల్ గా 'టక్ జగదీష్' ఓ ఫ్యామిలీ మూవీ.
రేటింగ్. 2.75-5