Telugu Gateway
Movie reviews

ఎమోషన్స్ తో కట్టిపడేసిన తండేల్ (Thandel Movie Review)

ఎమోషన్స్ తో కట్టిపడేసిన తండేల్ (Thandel Movie Review)
X

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో మూవీ అంటే సహజంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. అది కూడా నిజ జీవితంలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ఎప్పటి నుంచో చెపుతూ వస్తోంది. దీంతో ఈ సినిమా కథ పై పెద్దగా ఎవరికీ సస్పెన్సు...ఉత్సుకత చూపించే అంశాలు ఏమీ లేవు అనే చెప్పొచ్చు. ఎందుకంటే చిత్ర యూనిట్ ముందే స్టోరీ లైన్ చెప్పేసింది కాబట్టి. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జాలర్లు చేపల వేట కోసం వెళ్లి ఒక తుఫానులో ప్రమాదవశాత్తు పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అక్కడ పోలీసులకు చిక్కుతారు. వీళ్ళను లాహోర్ జైలు లో ఉంచుతారు. ప్రేక్షకులకు ముందే ఈ స్టోరీ లైన్ చెప్పి సినిమాను రెండున్నర గంటల పాటు ఆసక్తికరంగా తెరకెక్కించటం అంటే ఒకింత కత్తిమీద సామే. అయితే ఈ విషయంలో దర్శకుడు చందూ మొండేటి విజయవంతం అయ్యారు అనే చెప్పాలి.

తండేల్ అంటే ఆ జాలర్ల గ్రూప్ కు నాయకత్వం వహించేవాడు. గ్రామంతో పాటు జలాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అందరిని కంటికి రెప్పలా కాపాడుకునే వాడే తండేల్. వీళ్ళు అంతా ఏడాదిలో ఎక్కువ రోజులు సముద్రంలో చేపల వేటలోనే ఉంటారు..కొద్ది నెలలు మాత్రమే గ్రామంలో ఉంటారు. తండేల్ సినిమా అంతా నాగచైతన్య, సాయి పల్లవి లవ్ ట్రాక్, సముద్రంలో చేపలకు వెళ్ళటం వంటి అంశాల చుట్టూనే తిరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని మత్సలేశం గ్రామంలో ఉండే జాలర్ల కుటుంబ సభ్యుల్లాగా నాగ చైతన్య, సాయి పల్లవి తమ తమ పాత్రలకు జీవం పోశారు. జాలర్ల జీవితాలు ఎంత ప్రమాదంలో ఉంటాయో అందరికి తెలిసిందే. ఒక సారి చేపల వేటకు వెళ్లిన ఒక వ్యక్తి చనిపోవటం చూసి తండేల్ గా ఉన్న నాగ చైతన్య ను కూడా చేపల వేటకు వెళ్ళద్దని కోరుతుంది సాయి పల్లవి. అయితే మాట ఇచ్చి చెప్పకుండానే వేటకు వెళతాడు నాగ చైతన్య. అక్కడ నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది .

ఆ తర్వాత సాయి పల్లవి వేరే పెళ్ళికి ఒప్పుకుంటుంది. మరి ఆ పెళ్లి జరిగిందా.. పాకిస్థాన్ లో చిక్కుకున్న జాలర్లు అంతా ఎలా బయటకు వచ్చారు అన్నదే తండేల్ మూవీ. ఈ సినిమాలో హై లైట్ అంటే సముద్రంలో వచ్చే సన్నివేశాలు..పాకిస్థాన్ జైలు లో ఎమోషనల్ సీన్స్, గుండెలు పిండేసే లవ్ ట్రాక్. తొలుత సినిమా కొంత స్లో గా స్టార్ట్ అయిన ఫీలింగ్ కలిగినా క్రమక్రమంగా వేగం పంచుకుంటుంది. ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ లేకపోయినా..పూర్తి స్థాయి భావోద్వేగాలు నిండిన సినిమా గా తండేల్ ఆకట్టుకుంటుంది. తండేల్ సినిమా లో పాటలతో పాటు దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా ను ఒక రేంజ్ లో నిలబెట్టాయి అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత నాగ చైతన్య కు తండేల్ హిట్ ఇచ్చింది అనే చెప్పొచ్చు.

రేటింగ్: 3 / 5

Next Story
Share it