'శ్రీదేవి సోడా సెంటర్' మూవీ రివ్యూ
సుధీర్ బాబు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొంచెం భిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్' శుక్రవారం నాడు థియేటర్లలో విడుదలైంది. హీరో సుధీర్ బాబు మాత్రం సిక్స్ ప్యాక్ తో ఈ సినిమాలో చాలా కొత్తగా కన్పించాడు. అయితే ఈ సారి సినిమా ఎంపికలో సుధీర్ బాబు జడ్జిమెంట్ తప్పిందనే చెప్పాలి. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఓ ఊరు. ఆ ఊరులో జాతర. భారీ ఎత్తున జరిగే జాతరకు సంబంధించి ఏ పని ఎవరికి ఇవ్వాలనే గ్రామ పెద్దల నిర్ణయం. హీరోయిన్ శ్రీదేవి (ఆనంది) తండ్రి నరేష్ శ్రీదేవి సోడా సెంటర్ పేరుతో ఓ షాప్ నడుపుతుంటాడు. అప్పుడప్పుడు తండ్రికి చేదోడువాదోడుగా శ్రీదేవి ఉంటుంది. అదే ఊర్లో ఉండే సూరిబాబు (సుధీర్ బాబు) లైటింగ్, ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. ఈ జాతరలోనే శ్రీదేవి, సూరిబాబుల లవ్ ట్రాక్ సాగుతుంది. హీరో తమ కులం వాడు కాదని..శ్రీదేవి తండ్రి పెళ్లికి నిరాకరిస్తాడు. ఈ మధ్యలో తన తండ్రిని అవమానించిన వ్యక్తిపై దాడి చేసి హీరో జైలుకు వెళతాడు.
ఈ కేసు నుంచి హీరో బయటపడ్డాడా?. వీళ్ళ ప్రేమ ఫలిస్తుందా అన్నదే సినిమా కథ. సినిమా అంతా అచ్చమైన గ్రామీణ వాతావరణంలోనే సాగుతుంది. ఉప్పెన సినిమా తరహాలో ఈ సినిమాలో కూడా హీరోయిన్ తో అక్కడక్కడ బోల్డ్ డైలాగ్ లు చెప్పించారు. హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆనందిలు తమ పాత్రలకు న్యాయం చేసినా కూడా ఈ సినిమా కథ ఇప్పటికే పలు సినిమాల్లో చూసి చూసి ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదనే చెప్పొచ్చు. ఓవరాల్ గా చూస్తే శ్రీదేవి సోడా సెంటర్ లో ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అయ్యేది ఏమీ కన్పించదు. ఫస్టాఫ్ ఒకింత సరదాగా సాగిపోయినా..సెకండాఫ్ మాత్రం భారంగా సాగుతుంది. దర్శకుడు కరుణకుమార్ ఏదో సందేశం ఇస్తున్నట్లుగా క్లైమాక్స్ లో మాత్రం కులాంతర వివాహలు, ఈ జనరేషన్ పిల్లల ఆలోచనలపై కాసేపు బరువైన డైలాగ్ లతో కథ నడిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే 'శ్రీదేవి సోడా సెంటర్' ఓ టైమ్ పాస్ సినిమా.
రేటింగ్. 2.25-5