నిఖిల్ పాన్ ఇండియా జోష్ కొనసాగిందా?!
కార్తికేయ 2 సినిమా తో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో నిఖిల్ సినిమా స్పై పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. అదే సమయంలో ప్రముఖ జాతీయవాది సుభాష్ చంద్ర బోస్ కథగా ప్రచారం చేయటంతో దీనిపై హైప్ మరింత పెరిగింది. ఈ సినిమా గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే స్పై మూవీ ఏ మాత్రం అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో ఇదే తరహా రా ఏజెంట్స్ , రా ఆపరేషన్స్ సినిమాలు చాలానే వచ్చాయి. స్పై సినిమా చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు గోపి చంద్ హీరోగా నటించిన చాణిక్య సినిమా గుర్తుకు వస్తుంది అనటంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే నిఖిల్ రా ఏజెంట్. అంతకు ముందు నిఖిల్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా ఇదే వింగ్ లో పనిచేస్తూ ఒక ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోతాడు. అయితే తన అన్న ఎలా చనిపోయాడు...ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని కనుక్కోవటం తో పాటు రా అధికారులు అప్పగించిన మిషన్స్ పూర్తి చేస్తూ ఉంటాడు. అయితే చాలా సార్లు ఉన్నతాధికారుల ఆదేశాలు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటాడు నిఖిల్ . దీంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. అయినా కూడా అంతకు ముందు తనతో పని చేసిన టీం తో కలిసి దేశంపై జరగబోయే అణు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈ ఆపరేషన్ లో ఎవరు విజయం సాధించారు...నిఖిల్ తన అన్న ఎలా చనిపోయింది తెలుసుకున్నాడా అన్నదే సినిమా స్టోరీ. చూస్తుంటే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూసి ఈ సినిమా కు సుభాష్ చంద్ర బోస్ పేరును వాడుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
సినిమాలో అంతర్భాగంగా సుభాష్ చంద్రబోస్ ఫైల్ మిస్సింగ్ విషయాన్ని, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర బోస్ ఏర్పాటు చేసిన రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి చైనాపై దాడి చేయటం ద్వారా అది భారత్ చేసింది అని చూపించి...భారత్, చైనాలకు మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కల్పించటం వంటి సన్నివేశాలు చూపించారు. మొత్తం మీద భారత స్వాతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ కు దక్కాల్సినంత పేరు దక్కలేదనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు గ్యారీ బీ హెచ్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇది తప్ప సినిమా లో చెప్పుకోతగ్గ కథ ఏమీ లేదు. ఈ సినిమాలో ఏమైనా పవర్ ఫుల్ డైలాగు లు ఉన్నాయంటే చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు..దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి. స్వాతంత్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు...లాక్కునేది. ఇది నేను చెప్పింది కాదు. నేతాజీ చెప్పింది వంటివే. స్పై సినిమా లో ఏదైనా హైలైట్ ఉంది అంటే క్లైమాక్స్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన దగ్గుబాటి రానా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పిన డైలాగులే అని చెప్పాలి. రానా డైలాగులు చెప్పిన సమయంలో ప్రేక్షుకులు కూడా భావోద్వేగానికి గురి అవుతారు. సినిమా అంతా కూడా నిఖిల్, ఐశ్వర్య మీనన్, అభినవ్ ల చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టినట్లు ఐశ్వర్య మీనన్ పాత్ర ఉంది తప్ప ..దీనికి ఎలాంటి ప్రాధాన్యతలేదు. హీరో రా ఏజెంట్ అయితే..హీరోయిన్ ను ఎన్ఐఏ ఏజెంట్ గా చూపారు. స్పై సినిమా కథలో పెద్ద కొత్తదనం ఏమి లేకపోవటం తో ఇది ఒక సాదా సీదా సినిమాగా మిగిలిపోతుంది.