Telugu Gateway
Movie reviews

బోయపాటి, రామ్ ల కాంబినేషన్ సెట్ అయిందా?!

బోయపాటి, రామ్ ల కాంబినేషన్ సెట్ అయిందా?!
X

టాలీవుడ్ లో దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ కు సెట్ అయినంతగా మరెవరికి సెట్ కాదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి బోయపాటి హీరో రామ్ పోతినేని తో స్కంద సినిమా ప్రకటించగానే దీనిపై అంచనాలు పెరిగాయి...చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా . అసలు ఇదేమి కాంబినేషన్ అని అవాక్కు అయిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే బోయపాటి శ్రీను సినిమాలు ఎలా ఉంటాయో ప్రతిఒక్కరికి తెలుసు. అయన సినిమా లకు ఎవరూ లవ్ ట్రాక్ ల కోసమే...సందేశాత్మక కథల కోసం వెళ్ళరు. ఎందుకంటే బోయపాటి శ్రీనుకు ఉన్న ఇమేజ్ అలాంటిది మరి. బోయపాటి శ్రీను, రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన స్కంద ఈ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల ఉండటం మరో అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీ లీల రేంజ్ అలా ఉంది మరి. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మంచి స్నేహితులు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూతురు పెళ్లి మరికొద్ది గంటల్లో జరగాల్సి ఉండగా తెలంగాణ సీఎం కొడుకు ఆ అమ్మాయిని ఎత్తుకుపోతాడు. అక్కడ నుంచి ఇద్దరు సీఎంల మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరతాయి. ఆంధ్ర ప్రదేశ్ సీఎం తెలంగాణ సీఎం ను చంపించేందుకు కొంత మంది గూండాలకు బాధ్యతలు అప్పగిస్తాడు. ఈ గొడవలో అసలు హీరో రామ్ ఎందుకు ఎంటర్ అయ్యాడు. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి టాప్ కంపెనీ గా ఉన్న క్రౌన్ గ్రూప్ అధినేత గా ఉన్న శ్రీకాంత్ ను ఏమి సాయం కోరారు. అక్కడ ఏమి జరిగింది అన్నదే స్కంద సినిమా.తెలంగాణ సీఎం కూతురే హీరోయిన్ శ్రీ లీల. తాను సీఎం కూతురిగా కాకుండా ఒక స్టూడెంట్ లాగానే కాలేజీ కు వెళతాను అని చెప్పి వెళుతుంది. కాలేజీ లోనే రామ్, శ్రీ లీల లవ్ ట్రాక్ కామెడీగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. సెకండ్ హాఫ్ లో యాక్షన్ కు తోడు సెంటిమెంట్ ను కూడా జోడించి కథను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు ఈ సినిమాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్ లు వేయటంతో పాటు...ఉమ్మడి రాష్ట్రంలో ఒక అగ్రశ్రేణి ఐటి కంపెనీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటానికి జరిగిన తెర కారణాలు అంటూ ప్రచారంలో ఉన్న అంశాలను కూడా ఈ కథలో ప్రధానంగా టచ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇప్పుడు ఏ సినిమా వచ్చినా ఏదో ఒక అంశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ రాజకీయాలను టచ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన బాలకృష్ణ సినిమా వీరసింహ రెడ్డి లో అయితే పవర్ ఫుల్ డైలాగులు పెట్టారు. అభివృద్ధి అంటే నిర్మించటం..కూల్చటం కాదు...అభివృద్ధి అంటే పరిశ్రమలు తేవటం..ఉన్న వాటిని వెళ్లగొట్టటం కాదు అంటూ చెప్పిన విషయం తెలిసిందే. మరో వైపు పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా బ్రో లోని ఒక పాట పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు బోయపాటి, రామ్ సినిమా స్కంద లో కూడా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ అంశాలను టచ్ చేశారు. ఇక హీరో రామ్ విషయానికి వస్తే వీర మాస్ లుక్ లో రామ్ తన రెండు పాత్రలకు న్యాయం చేశారు. అయితే బోయపాటి మార్క్ మాస్ బరువుకు సరిపోలేదు అనే అభిప్రాయం కలుగుతుంది. దర్శకుడు బోయపాటి హీరో రామ్ కు తనదైన స్టైల్ లో ఎంట్రీ సమయంలోనే ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు. హీరోయిన్ శ్రీ లీల ఎప్పటిలాగానే పాటల్లో తనదైన డాన్స్ తో ధుమ్మురేపింది. మాస్ సినిమాలకు బాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అత్యంత కీలక అనే విషయం తెలిసిందే. థమన్ ఈ సినిమా రేంజ్ కు తగ్గట్లు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ లీల తో పాటు సయీ మంజ్రేకర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యమంత్రులుగా అజయ్ పూర్కర్, శరత్ లోహితాస్య లు, ఐటి కంపెనీ అధినేతగా శ్రీకాంత్ కనిపిస్తారు. ఇతర కీలక పాత్రల్లో గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ లు తమ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు . ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం బోయపాటి, హీరో రామ్ ఫ్యాన్స్ కు మాత్రమే. సినిమా చివరిలో స్కంద కు పార్ట్ టూ కూడా ఉంది అని ప్రకటించారు.

రేటింగ్:2 .5 /5



Next Story
Share it