Telugu Gateway
Movie reviews

నాని ఈ ఆగస్ట్ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడా?!(Saripodhaa Sanivaaram Movie review)

నాని ఈ ఆగస్ట్ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడా?!(Saripodhaa Sanivaaram Movie review)
X

ఈ ఆగస్ట్ లో వచ్చిన మిడ్ రేంజ్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఇందులో రవి తేజ హీరో గా నటించిన మిస్టర్ బచ్చన్, రామ్ హీరో గా నటించిన డబుల్ ఇస్మార్ట్ లు ఉన్న విషయం తెలిసిందే. విచిత్రం ఏమిటి అంటే ఆగస్ట్ లోనే విడుదల అయిన చిన్న సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తే వీళ్లిద్దరి సినిమాలు మాత్రం దారుణ ఫలితాలను చవిచూశాయి. దీంతో అందరి కళ్ళు నాని సినిమా సరిపోదా శనివారంపై పడ్డాయి. ఈ సినిమాకు మార్కెట్ లో మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సరిపోదా శనివారం సినిమా పై ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పాయి. హాయ్ నాన్న హిట్ తర్వాత నాని చేసిన సినిమానే ఈ సరిపోదా శనివారం. ఈ టైటిల్ కూడా సినిమాపై ఆసక్తి పెంచటంలో విజయవంతం అయింది అనే చెప్పాలి. సరిపోదా శనివారం సినిమా రొటీన్ కు బిన్నంగా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే మనిషికి కోపం రావటం అన్నది ఎంత సహజమో అందరికి తెలిసిందే. అయితే కోపం రాని వాళ్ళు కూడా ఉంటారు కానీ..వాళ్ళు అతి అరుదైన మనుషులుగానే చెప్పాలి. అయితే ఎవరైనా కోపం వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఏదో ఒక రూపంలో చూపిస్తారు.

ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే వారం రోజుల్లో తనకు ఎదురయ్యే సంఘటనల్లో వచ్చే కోపాన్ని..అందుకు కారణాలను ఒక డైరీ లో రాసుకుని...శనివారం నాడు మాత్రమే ఆ కోపాన్ని తీర్చుకుంటే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా. వారంలో ఒక్క రోజు మాత్రమే కోపం తీర్చుకోవటానికి కేటాయించాలి అనే ఒక వెరైటీ లైన్ తీసుకుని దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇదే లైన్ తో ఏకంగా మూడు గంటల సినిమాను నడిపించటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ ఇందులో దర్శకుడు వివేక్ ఆత్రేయ విజయవంతం అయ్యారు. నానికి జోడిగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటించినా ఆమె ఇందులో స్టోరీ లో భాగంగానే వస్తుంది తప్ప..ఇందులో పెద్దగా లవ్ ట్రాక్ కూడా ఏమి లేదు అనే చెప్పాలి. ఒక చిన్న లైన్ తో సినిమాను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ విజయవంతం అయితే...సినిమా ను తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా జేక్స్ బిజోయ్ ఒక రేంజ్ కు తీసుకెళ్లారు. ఈ మ్యూజిక్ తోనే సరిపోదా శనివారం హిట్ గా నిలిచింది అని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

మరో కీలక విషయం ఏమిటి అంటే హీరో నాని కంటే విలన్ గా నటించినా ఎస్ జె సూర్య కే పవర్ ఫుల్ పాత్ర దొరికింది అని చెప్పాలి. సైకో ఇన్స్పెక్టర్ పాత్రలో సూర్య తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కొన్ని సార్లు నాని ని సూర్య డామినేట్ చేశాడు అనే ఫీలింగ్ కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. స్టోరీని నడిపించటం కోసం సృష్టించిన సోకులపాలెం గ్రామ సమస్యను మాత్రం సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చేసినవే. సరిపోదా శనివారం సినిమాలో సోకులపాలెం ఎపిసోడ్ ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్ గా ఉండేది. సరిపోదా శనివారం సినిమా చూస్తే హీరో నాని మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం దసరా సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించిన నాని..ఇప్పుడు ఈ సినిమా ద్వారా కూడా అదే ఇమేజ్ కోసం ప్రయత్నం చేశాడు అనే చెప్పాలి. నాని, ఎస్ జె సూర్యలతో పాటు ఈ సినిమా లో కీలక పాత్రల్లో నటించిన మురళి శర్మ, సాయి కుమార్, అజయ్ ఘోష్, హర్ష వర్ధన్ లు తమ వంతు ప్రభావం చూపించారు. మొత్తం మీద హీరో నాని ఈ ఆగస్ట్ నెలను హిట్ తోనే ముగించాడు అని చెప్పొచ్చు.

రేటింగ్ : 3 / 5

Next Story
Share it