Telugu Gateway
Movie reviews

సూపర్ కాంబినేషన్ హిట్ కొట్టిందా!

సూపర్ కాంబినేషన్ హిట్ కొట్టిందా!
X

బాహుబలి రెండు పార్ట్ ల తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ కు ఇంత వరకు మంచి హిట్ దక్కలేదు. అయన చేసిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సో సో గానే ఆడాయి. దీంతో ప్రభాస్ ఫాన్స్ క్రేజీ కాంబినేషన్ అయిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా కావటంతో సలార్ పై పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే సలార్ రేంజ్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటించింది. అసలు జోడి అనే పదం వాడటం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే సినిమాలో ఆమె క్యారెక్టర్ అలా ఉంది మరి. సలార్ లో ఒక సీరియస్ పాత్రకు ఝాన్సీ ని తీసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ పెద్ద తప్పు చేశాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు ఆ సీరియస్ పాత్ర ఏ మాత్రం సెట్ కాలేదు. సలార్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్, పృద్విరాజ్ సుకుమారన్ ల స్నేహం చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. పృద్విరాజ్ కు ఏ సాయం అంటే అది చేయటానికి ప్రభాస్ సిద్ధంగా ఉంటాడు. ఒక సారి తన తల్లిని కాన్సార్ ప్రాంతానికి చెందిన కొంత మంది వేధిస్తున్న తరుణంలో ప్రభాస్ కు పృద్వి అండగా నిలుస్తాడు. అప్పటి నుంచి వాళ్ళు ఊరు వదిలిపోయి నిత్యం ప్రాంతాలు మారుతూ జీవనం సాగిస్తారు. సెకండ్ హాఫ్ లోనే కాన్సార్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం పోరాటం...ఆ సమయంలో తన స్నేహితుడు పృద్విరాజ్ ఇబ్బందుల్లో ఉండటంతో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే సలార్ సినిమా అంతా ఇద్దరు స్నేహితులు, తల్లి మాట జవదాటని కొడుకుగా కనిపించే ప్రభాస్, కాన్సార్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. కెజీఎఫ్ లో బంగారు గనుల చుట్టూ కథను నడిపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కథ అంతా కూడా కాన్సార్ సామ్రాజ్యములో జరిగే అధిపత్యపు పోరాటాలతో రాసుకున్నాడు. అయితే ప్రభాస్ కనిపించినప్పుడు వచ్చే ఎలివేషన్ సీన్స్ తప్ప కథలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయలేకపోయాడు అనే చెప్పాలి. సినిమాలో ప్రభాస్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు థియేటర్లు దద్దరిల్లాయి. ఫైట్స్ కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే సినిమా ప్రారంభం నుంచి స్లో గా సాగుతుంది అనే ఫీల్ వస్తుంది ప్రేక్షకులకు. ప్రభాస్ సినిమా అంతా సీరియస్ లుక్ లో తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. పృద్విరాజ్ సుకుమారన్ కు కూడా మంచి పాత్ర దక్కింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లైమాక్స్ లో అసలు విషయాన్నీ వెల్లడించి రెండవ పార్ట్ పై అంచనాలు పెంచేలా చేయగలిగారు. అయితే ఫస్ట్ పార్ట్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయిందే అనే చెప్పాలి. ప్రభాస్ ఫాన్స్ కూడా మాత్రం ఈ సినిమా పండగే. సాధారణ ప్రేక్షకుల విషయానికి వస్తే ఇదో రొటీన్ యాక్షన్ మూవీ గానే నిలుస్తుంది. కెజీఎఫ్ సినిమాల్లో వచ్చిన కిక్ ఇక్కడ మిస్ అయింది.

రేటింగ్: 2 .75 /5


Next Story
Share it