Telugu Gateway
Movie reviews

కిరణ్ అబ్బవరం ట్రాక్ లోకి వచ్చాడా?

కిరణ్ అబ్బవరం ట్రాక్ లోకి వచ్చాడా?
X

హీరో కిరణ్ అబ్బవరంకు ఈ మధ్యకాలంలో దక్కిన హిట్ అంటే వినరో భాగ్యం విషుకథ. ఈ యువ హీరో ఫలితంతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇది దెబ్బకొడుతుంది అని గ్రహించి రూట్ మార్చుకుంటానని ఈ మధ్య ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన రూల్స్ రంజన్ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఒకింత బజ్ పెరగటానికి హీరోయిన్ నేహా శెట్టి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మరో సారి హీరో కిరణ్ అబ్బవరం కు నిరాశనే మిగ్లిచింది అని చెప్పాలి. ఇక సినిమా కథ విషయానికి వస్తే యావరేజ్ స్టూడెంట్ అయిన హీరో డిగ్రీ పూర్తి చేసుకుని ముంబై లోని ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు. తెలుగు తప్ప హిందీ ఏ మాత్రం రాని హీరో ముంబై ఆఫీస్ లో పడే కష్టాలు...కంపెనీలోని ఉద్యోగులు హీరోతో ఎలా ఆడుకుంటారు. ఆ తర్వాత కంపెనీలోని ఉద్యోగులు అందరిని తన రూల్స్ ఫాలో అయ్యేలా హీరో ఎలా చేసుకున్నాడు...దీని వెనక ఉన్న కథ ఏంటి అన్నదే సినిమా. హీరో కిరణ్ అబ్బవరం తన ఆఫీస్ లో అయినా...తాను ఉండే అపార్ట్ మెంట్ లో అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటాడు. అలాంటిది తన ఫ్లాట్ ఎదురుగా ఉండే వెన్నెల కిషోర్ తో విభేదాలు వస్తాయి. పద్దతికి బ్రాండ్ అంబాసడర్ గా ఉండాలని కోరుకొనే హీరో కు...విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరిగే వెన్నెల కిషోర్ కు అసలు పొసగదు.

అందుకే కిషోర్ చేసే పనులపై ఫిర్యాదు చేసి..ఫ్లాట్ ఖాళీ చేయించుతాడు. ఆ సమయంలోనే హీరో వెన్నెల కిషోర్ కు తన కాలేజీ రోజుల్లో ఉన్న మౌన ప్రేమ కథను చెపుతాడు. సడెన్ గా ఒక రోజు తన క్లాస్ మెట్...రహస్యంగా ప్రేమించిన హీరోయిన్ నేహా శెట్టి ముంబై మెట్రోలో కనిపిస్తోంది. అసలు నేహా శెట్టి ముంబై కి ఎందుకు వచ్చింది...మరి వీరి ప్రేమ సక్సెస్ అయిందా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే. దర్శకుడు రత్నం కృష్ణ తెరకెక్కించిన కథలో ఎక్కడా ఆసక్తి కలిగించే సన్నివేశాలు కనపడవు. హీరో కిరణ్ అబ్బవరానికి కూడా ఇందులో నటనకు ఏ మాత్రం స్కోప్ లేదు. హీరోయిన్ నేహా శెట్టి తన పాత్రలో ఆకట్టుకుంటుంది. ఇందులో రెండు పాటలు బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ కూడా ఒకింత సరదాగా ఉంటుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర తేలిపోతుంది. కామెడీ కోసం ఉండటానికి సినిమాలో హైపర్ అది, వైవా హర్ష, సుదర్శన్ లు ఉన్నా వీళ్ళ పాత్రలు కూడా ఏ మాత్రం ఆకట్టుకోవు. బలమైన కథ లేక...ఆకట్టుకునే కామెడీ లేకపోవటంతో రూల్స్ రంజన్ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది అనే చెప్పాలి.

రేటింగ్:2 .5 /5

Next Story
Share it