Telugu Gateway
Movie reviews

‘రామబాణం’ మూవీ రివ్యూ

‘రామబాణం’ మూవీ రివ్యూ
X

హీరో గోపీచంద్ కు ఎందుకో కాలం కలిసిరావడం లేదు. టాలీవుడ్ లో చాలా మంది హీరో లతో పోలిస్తే నటన విషయంలో అయనకు వంక పెట్టాల్సిన పని ఉండదు. కానీ గత కొంత కాలంగా రొడ్డకొట్టుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావటం...బోల్తా కొట్టడం పరిపాటిగా మారిపోయింది. సీటిమార్, పక్కా కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతికూల ఫలితాన్నే చవిచూశాయి. ఇప్పుడు గోపీచంద్ రామబాణం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో భారీ తారాగణం ఉండటం, గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ మరో సారి రిపీట్ కావటం తో సినిమా పై అంచనాలు ఒకింత పెరిగాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి ఫలితాన్ని సాధించాయి. దీంతో రామబాణం పై కూడా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా స్టోరీ ఏమిటి అంటే సుఖీభవ బ్రాండ్ హోటల్స్ తో అతి తక్కువ ధరకు ఆర్గానిక్ ఫుడ్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు జగపతి బాబు. ఆ హోటల్ లోనే పనిచేస్తాడు అయన తమ్ముడు గోపి చంద్. వీళ్ళ వల్ల తమ వ్యాపారం దెబ్బ తింటుంది అని నాజర్ తన కున్న పలుకుబడి తో పోలీస్ లు ..ఇతర వ్యవస్థలు వాడుకుని వాళ్ళను ఇబ్బందులకు గురిచేస్తాడు. ఏ సమస్య వచ్చినా పద్ధతి ప్రకారమే ముందుకు పోవాలి అంటాడు జగపతి బాబు. కాదు ఇప్పుడు ఈ పద్ధతి నడవదు అంటాడు గోపీచంద్. గోపీచంద్ ను జగపతి బాబు పోలీస్ స్టేషన్ లో అప్పగించేందుకు తీసుకెళుతున్న సమయంలో తప్పించుకుని ట్రైన్ ఎక్కి కోలకతా చేరుకుంటాడు.

ఎప్పటికైనా విజయవంతం అయి తిరిగి వస్తానని చెప్పి వెళ్తాడు. అలా కోలకతా వెళ్లిన గోపి చంద్ అక్కడ ఏమి చేశాడు...మళ్ళీ తిరిగి అన్న జగపతి బాబు దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చింది...వచ్చాక ఏమి జరిగింది అన్నదే ఈ సినిమా. రామబాణం సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు నితిన్ భీష్మ, అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం తో పాటు ఎన్నో సినిమాలు అలా ప్రేక్షుకుల మదిలో మెదులుతాయి. కొన్ని డైలాగులు అయితే మక్కికి మక్కి దింపేశారు కూడా. సినిమా పై భారీగా ఖర్చు పెట్టినా..ఎంత రిచ్ గా తీసినా కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటం తో గోపీచంద్ ఖాతాలో రామబాణం మరో రొటీన్ సినిమాగా ఇది మిగిలిపోయే అవకాశం ఉంది. పోనీ పాత కథలతో ఏమైనా కొత్తదనం చూపించారా అంటే అది కూడా ఎక్కడా మచ్చుకైనా కనిపించదు. గోపీచంద్ కు ఈ సినిమాలో జోడిగా నటించిన డింపుల్ హయతి పాత్ర కూడా చాలా పరిమితంగా ఉంది. పాటల్లో కనిపించటం తప్ప ఆమెకు నటనకు ఏ మాత్రం స్కోప్ లేదు. ఇందులో గోపీచంద్, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిషోర్, సత్య ఇలా చాలా మంది నటులు ఉన్నా సినిమాలో జోష్ మాత్రం ఎక్కడా కనిపించదు. ఈ సినిమాలో గోపీచంద్ చాలా స్టైల్ గా కనిపించి ..తనకు కొట్టిన పిండి అయిన యాక్షన్ సన్నివేశాలను కూల్ గా చేసినా వీక్ స్టోరీ తో ఉపయోగం లేకుండా పోయింది అనే చెప్పాలి. రామబాణం మూవీ గోపీచంద్ కు మరో సారి నిరాశనే మిగిలిచింది. శ్రీవాస్,, గోపీచంద్ కాంబినేషన్ పై నమ్మకాలూ వమ్ము అయ్యాయి.

రేటింగ్: 2 .25 -5

Next Story
Share it