Telugu Gateway
Movie reviews

అమరావతి కథతో సినిమా ( Rajadhani Files Movie Review)

అమరావతి కథతో సినిమా ( Rajadhani Files Movie Review)
X

ఇది ఎన్నికల సినిమాల సీజన్. ఈ సినిమాల ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం కనిపించకపోదా...కొన్ని ఓట్లు అయినా రాక పోతాయా అనే లెక్కలతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే యాత్ర 2 విడుదల కాగా...గురువారం నాడు తెలంగాణ లో రాజధాని ఫైల్స్ సినిమా విడుదల అయితే...ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా విడుదలపై హై కోర్ట్ స్టే విధించింది. దీంతో అక్కడ మధ్యలోనే సినిమాను నిలుపుదల చేశారు. రాజధాని ఫైల్స్ అనే టైటిల్ చూస్తేనే ఈ సినిమా దేని గురించి అన్నది ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఈ సినిమాలో పాత్రలు...పాత్రధారులు అన్ని కల్పితమే అని డిస్క్లైమర్ ఇచ్చినా కూడా సినిమా అంతా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. అయితే చట్టపరమైన ఇబ్బందులు రాకుండా అమరావతి పేరు ను ఐరావతి గా మార్చారు. గత ఐదేళ్ల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా...దేశంలోని ప్రజలందరికి తెలిసిందే.ఇలాంటి తెలిసిన కథను...సినిమాటిక్ గా...ఆకట్టుకునేలా చెప్పటంలో భాను ఒకింత తడబడ్డారు అనే చెప్పాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పడిన ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. అదే సమయంలో అమరావతి పై అధికార పార్టీ ఎందుకు...ఎలా బ్రాండింగ్ చేసిందో కూడా ఇందులో వివరించారు. అయితే ఈ సినిమా ఎక్కువ భాగం ఏదో డాక్యుమెంటరీ చూస్తున్నామని ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమైనా ఉంది అంటే దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ఎన్నికల వ్యూహకర్త పాత్రధారిని మాత్రం ఒరిజినల్ క్యారక్టర్ తో పోలిన వ్యక్తిని దింపారు.

ఈ సినిమా కథను నడిపించడంలో...అరుణ ప్రదేశ్ సీఎం కు ప్రతి విషయంలో సలహాలు ...సూచనలు ఇవ్వటంలో ఆ వ్యహకర్తను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సీఎం ...ఆయన చుట్టూ ఉండేది ఒకరు ఒక దొంగ లెక్కల ఎంపీ అని..మరో లోక్ సభ సభ్యుడిని చూపించారు. ఇందులో పర్ఫెక్ట్ గా సెట్ అయినవి ఎలక్షన్ వ్యూహకర్త...సీఎం పాత్రదారులవే అని చెప్పొచ్చు. ఎన్నికల్లో గెలుపు కోసం అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన డబ్బులు బ్యాలట్ బాక్స్ ల దగ్గర ఒక స్పెషల్ బాక్స్ లు పెడితే ప్రజలు మళ్ళీ వాటిని అందులో వేస్తారు. అవి మొత్తం లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయలు వచ్చినట్లు చూపిస్తూ....ఇదే డబ్బు తో ఐరావతి కట్టినట్లు సినిమాటిక్ ముగింపు ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్రధారులుగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే, కేసినో విషయాలు కూడా రాజధాని ఫైల్స్ లో ఉన్నాయి. రాజధాని అమరావతికి సంబంధించిన డైలాగులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ఒక సన్నివేశంలో సీఎం పాత్రధారి నిత్యం పక్కన ఉండే ఎంపీ ని బాత్రూం లోకి తన్ని గొడ్డలితో నరికి ...మన టీవీ లో బాత్రూం లో గుండె పోటు అని వేయించండి అని చెప్పించటం ఒక కేసు ను గుర్తుకు తెస్తుంది.తెలిసిన కథ కావటం...ఈ సినిమాలో వాణి విశ్వనాథ్, వినోద్ కుమార్ లు తప్ప పెద్దగా తెలిసిన నటులు ఎవరు లేకపోవటం కూడా రాజధాని ఫైల్స్ పై ప్రభావం చూపించే అంశం అని చెప్పొచ్చు.

Next Story
Share it