'పొన్నియన్ సెల్వన్ 1' మూవీ రివ్యూ
ఈ సినిమా నిండా భారీ తారాగణం. దర్శకుడు మణిరత్నం. మ్యూజిక్ ఏ ఆర్ రెహమాన్. సహజంగా సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ఊహించటం పెద్ద కష్టం కాదు. చోళ రాజ్యానికి సంబంధించిన కథ ఇది. అది కూడా పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా తొలి భాగం శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండవ భాగం వచ్చే ఏడాది రానుంది. సహజంగా రాజుల సమయంలో ఆయా రాజ్యాల్లో ఉండే కుట్రలు..కుతంత్రాలే ఈ సినిమా కథలోనూ ప్రధానంగా కన్పిస్తాయి. సామంతరాజులు చేసే కుట్రలు..వాటిని తిప్పికొట్టే ఘట్టాలే ఈ సినిమా. వాస్తవానికి ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఒకింత కష్టంతో కూడుకున్న పనే. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్వారాయ్, త్రిషలు కీలక పాత్రలు పోషించారు. కీలక నటులు చాలా మంది ఉన్నా..ఈ సినిమా అంతా కార్తిమీదే నడిచిపోతుంది. తొలి భాగంలో విక్రమ్ కొద్దిసేపు ఉంటారు..సెకండాఫ్ లోనూ ఆయన పాత్ర పరిమితమే. అయితే సెకండాప్ లో జయం రవికి ప్రాధాన్యత దక్కుతుంది. ప్రారంభం నుంచి ఈ సినిమా లొకేషన్లు..సీన్లు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు హైలెట్ అంటే డైలాగ్ లే. ముఖ్యంగా కార్తి, ఐశ్వర్యారాయ్ మధ్య వచ్చే సంభాషణలు..కార్తి, త్రిష మధ్య వచ్చే డైలాగ్ లు ఈ మొత్తం సినిమాలో హైలెట్. తనతో కలసి యుద్ధంలో పాల్గొని మంచి పోరాటం చూపిన కార్తిని విక్రమ్ తన తండ్రి దగ్గర జరుగుతున్న కుట్రల గురించి తెలుసుకుని రమ్మని పంపుతాడు. ఆ క్రమంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. పొన్నియన్ సెల్వన్ 1 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా హీరో కార్తి. అంతే.
ఇందులో మరో మాటకు ఛాన్స్ లేదు. తనదైన ఈజ్ తో సినిమా అంతా మంచి ప్రభావం చూపించాడు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యారాయ్, త్రిషలు వెండితెరపై వెలుగులు కురిపించారనే చెప్పొచ్చు. వీరిద్దరూ, కార్తి మధ్య సంభాషణలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. దర్శకుడు మణిరత్నం హీరోయిన్లు ఇద్దరినీ ఎంతో అందంగా..అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో చాలా యుద్ధ సన్నివేశాలు బాహుబలి సినిమాను గుర్తుకు తెస్తాయి. అయితే బాహుబలి సినిమాలో ఉన్న ఇంటెన్సిటి పొన్నియన్ సెల్వన్ 1లో ఎక్కడా కన్పించదు. ప్రారంభం నుంచి సినిమా చాలా స్లోగా ముందుకు సాగుతున్నట్లు అన్పిస్తుంది. సినిమాలో సందడి ఏదైనా ఉంది అంటే అది కార్తి తెరపై కన్పించినప్పుడే. పొన్నియన్ సెల్వన్ ను ఓ మహిళ కష్టాల్లో పడిన ప్రతిసారి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరు..ఆయన్ను ఎందుకు కాపాడుతుంది అనే విషయాలు బహుశా రెండవ భాగంలో చూపించబోతున్నారు. అయితే ఇది బాహుబలిలో కట్టప్ప తరహా సస్పెన్స్ కు ప్రయత్నించినా..అంత తీవ్రత తీసుకురావటంలో దర్శకుడు మణిరత్నం విజయం సాధించలేదనే చెప్పొచ్చు. ఈ కథే ప్రేక్షకులకు చాలా వరకూ గందరగోళంగా ఉంటుంది. అయినా మణిరత్నం టేకింగ్...కార్తి కోసం సినిమా చూడొచ్చు.
రేటింగ్.2.75-5