వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆకట్టుకుందా? (Operation Valentine Movie Review)
వరుణ్ తేజ్ నటించిన సినిమాలు అన్నీ ఈ మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. అందులో ఘనీ, గాండీవధారి అర్జున సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్ 3 ఒక మోస్తరుగా పర్వాలేదు అనిపించింది. ఈ హీరో తిరిగి గాడిన పడాలంటే ఇప్పుడు హిట్ అవసరం. అందుకే తెలుగులో ఇప్పటివరకు ఎవరూ చేయని ఏరియల్ యాక్షన్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కించారు. వరుణ్ తేజ్ మొదటి నుంచి వెరైటీ కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి ప్రయత్నం చేస్తాడు. ఇందులో కొన్ని సార్లు విజయం సాధించాడు...మరి కొన్ని సార్లు ఆశించిన ఫలితాలు సాధించలేక పోయాడు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కథ విషయానికి వస్తే ఇండియాలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ప్రధానంగా పుల్వామా దాడి అనంతరం బాలాకోట్ లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ చుట్టూనే సినిమా కథ అంతా తిరుగుతుంది.
ఇందులో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్ గా కనిపిస్తారు. హీరోయిన్ మానుషీ చిల్లర్ కూడా ఇదే విమానిక విభాగంలో రాడార్ ఆఫీసర్ గా పనిచేస్తుంది. శత్రు దేశాల రాడార్ కంటికి చిక్కకుండా ఉండేందుకు డిజైన్ చేసిన వజ్ర ప్రాజెక్ట్ కూడా ఈ కథలో కీలక ఘట్టంగా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ లో వచ్చిన ఇబ్బందులు...తర్వాత ఇది సాకారం అయిందా లేదా అన్నదే సినిమా. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన వాస్తవ అంశాల ఆధారంగా సినిమా అంతా సాగుతుంది. సినిమా ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పని చేస్తుంది...అత్యవసర సమయాల్లో ఎలా సిద్ధం అవుతారు అన్నది ప్రేక్షకులను ఆకట్టుకునేలే చూపారు. ఈ సినిమా ప్రధాన బలం అంటే గగనతలంలో యుద్ధ విమానాలతో చేసే అద్భుత విన్యాశాలే అని చెప్పొచ్చు. బాలాకోట్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై యుద్ధ విమానాలతో దాడి చేసే సన్నివేశాలే ఈ సినిమాకు హై లైట్. యుద్ధ విమానాల పైలట్ గా హీరో వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఒక్కోసారి ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా దూకుడు గా వెళ్లే పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తాడు. హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏమి కనిపించవు.
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ వైమానిక దళ ఆపరేషన్స్, యాక్షన్స్ ను తెరపై అద్భుతంగా చూపించారు. సినిమా చాలా రిచ్ గా కూడా కనిపిస్తుంది. ఈ సినిమా కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక ప్రధాన బలంగా చెప్పొచ్చు. కానీ కథలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయటంలో దర్శకుడు తడబడినట్లు కనిపిస్తుంది. ఆపరేషన్ వాలెంటైన్ కేవలం ఎయిర్ ఫోర్స్ స్టోరీకి పరిమితం చేయటకుండా..ఇందులో ప్రధాని మోడీ తరహా నేతను పెట్టి స్టోరీ నడిపించటంతో దీని వెనక ఏమైనా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనే అనుమానం ప్రేక్షకుల్లో రావటం సహజం. ఈ సినిమా ఎన్నికల ముందే విడుదల కావటం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మొత్తం మీద ఆపరేషన్ వాలెంటైన్ కొత్తదనం కోరుకునే వాళ్లకు నచ్చే మూవీ.
రేటింగ్: 2 .75 -5