Telugu Gateway
Movie reviews

'నాట్యం' మూవీ రివ్యూ

నాట్యం మూవీ రివ్యూ
X

నాట్యం. ఈ మ‌ధ్య కాలంలో ఏ టాప్ హీరో సినిమాకు కూడా ఇంత‌లా హైప్ క్రియేట్ కాలేదు. అంతే కాదు..డిజిట‌ల్ యాడ్స్ విష‌యంలోనూ ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింద‌నే చెప్పాలి. ఎక్క‌డా చూసిన ఆన్ లైన్ లో ఈ సినిమా యాడ్స్. ఈ స్పీడ్ యుగంలో సంప్ర‌దాయ నృత్యంపై సినిమా తీయ‌టం అంటే ఓ సాహ‌స‌మే అని చెప్పాలి. ఎలాంటి వాణిజ్య అంశాలు లేకుండా కేవలం సంప్ర‌దాయ నృత్యంపై సినిమా అంటే అంద‌రిలోనూ ఆస‌క్తి అయితే పెరిగింది. దీనికితోడు ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించిన సంధ్యారాజు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కార‌ణంగా ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులు అంతా సినిమా ప్ర‌చారానికి త‌మ వంతు సాయం చేశారు. మొత్తం మీద ఈ సినిమా విష‌యంలో సంధ్యారాజు చేసిన తొలి ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌నే చెప్పాలి. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే నాట్యం పేరుతో ఒక ఊరు ఉంటుంది. బ్రిటిష‌ర్లు డ్యాన్స్ అంటే అస‌భ్యం అని దాన్ని నిషేధించి ...డ్యాన్స్ సంబంధించిన పుస్త‌కాలు కూడా లేకుండా చేస్తారు. కానీ ఆ గ్రామంలో సితార (సంధ్యారాజు) ఇంట్లోనే ఓ డ్యాన్స్ స్కూల్ ఉంటుంది. సితార నిత్యం అక్క‌డ జ‌రిగే డ్యాన్స్ లు చూస్తూ పెరుగుతుంటుంది. నాట్యం అంటే కేవ‌లం శ‌రీర క‌ద‌లిక‌లు కాద‌ని..నాట్యం ద్వారా క‌థ చెప్పొచ్చ‌ని చెబుతాడు సితార‌కు ఆ నాట్య పాఠ‌శాల గురువు. అలాగే డ్యాన్స్ శిక్షణ పూర్తి చేసుకున్న త‌ర్వాత కాదంబ‌రి క‌థ చెప్పే అవ‌కాశం ఇస్తాన‌ని హామీ ఇస్తాడు.

అయితే డ్యాన్స్ పాఠ‌శాల గురువు భార్యే త‌న డ్యాన్స్ ద్వారా కాదంబ‌రి క‌థ చెప్పేందుకు రెడీ అవుతున్న స‌మ‌యంలో ఆమె పాము కాటుతో మ‌ర‌ణిస్తుంది. అప్ప‌టి నుంచి సితార గురువు ఏదైనా కొత్త మార్గం ద్వారా డ్యాన్స్ రంగ ప్ర‌వేశం చేయించుతాన‌ని హామీ ఇస్తాడు. కానీ కాదంబ‌రి క‌థ‌కు మాత్రం ఒప్పుకోడు. సితార ఇంట్లో ఉన్న డ్యాన్స్ స్కూళ్ళో శిక్షణ కోసం హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన అబ్బాయితో ప్రేమ‌లో ప‌డుతుంది. దీంతో చిక్కుల్లో ప‌డి నాట్యం గ్రామం వ‌దిలిపెట్టి ఆమె కూడా హైద‌రాబాద్ చేరుకోవాల్సి వ‌స్తుంది. మ‌రి ఆమె తాను అనుకున్న‌ట్లు నాట్యం గ్రామంలో కాదంబ‌రి కథ ఎలా చెప్పింది. అప్ప‌టి వ‌ర‌కూ ఆ గ్రామ ప్ర‌జ‌లు న‌మ్మింది ఏమిటి? అస‌లు నిజం ఏమిటి అన్న‌దే ఈ సినిమా. ఓవ‌రాల్ గా చూస్తే భారీ అంచ‌నాలు పెట్టుకోకుండా వెళితే కుటంబ స‌మేతంగా హాయిగా చూడ‌ద‌గ్గ సినిమా. తొలి సినిమానే అయినా సంధ్యారాజు న‌ట‌న‌లో ఈజ్ ఉంది. డ్యాన్స్ గురువులుగా న‌టించిన అదిత్య‌మీన‌న్, క‌మ‌ల్ రాజు, అమెరికాలో జ‌రిగే డ్యాన్స్ కాంపిటేష‌న్ లో పాల్గొనేందుకు నాట్యం గ్రామానికి వ‌చ్చి సితారతో ప్రేమ‌లో ప‌డే పాత్ర‌లో రోహిత్ బెహ‌ల్ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

రేటింగ్. 3-5

Next Story
Share it