Telugu Gateway
Movie reviews

నార‌ప్ప మూవీ రివ్యూ

నార‌ప్ప మూవీ రివ్యూ
X

క‌రోనా దెబ్బ‌కు టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు ఏమీ ఈ మ‌ధ్య విడుద‌ల కాలేదు. చాలా విరామం త‌ర్వాత వెంక‌టేష్ హీరోగా న‌టించిన 'నారప్ప' సినిమా మంగ‌ళ‌వారం నాడు అమెజాన్ ఓటీటీలో విడుద‌ల అయింది. ప‌లు తెలుగు సినిమాల్లో చూసిన‌ట్లే ఈ సినిమాలోనూ గ్రామ పెద్ద‌లు...భూముల పంచాయ‌తీల‌తోనే సినిమా ప్రారంభం అవుతుంది. త‌మిళ సినిమా అసుర‌న్ కు ఇది రీమేక్ అన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా లో హీరో వెంక‌టేష్ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించార‌ని చెప్పొచ్చు. క‌థ‌లో కొత్తద‌నం గురించి వ‌దిలేస్తే వెంకటేష్ త‌న పాత్ర‌ల్లో వేరియేష‌న్స్ బాగా పండించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా అద్భుతంగా నటించాడు. వెంకీ డైలాగులు, స్టైల్‌, లుక్స్ అన్నీఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ఎమోషనల్ సీన్స్‌లో వెంకటేశ్‌ కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా కుమారుడు చనిపోయిన సీన్‌, గ్రామ ప్రజల కాళ్లు మొక్కిన సీన్లలో త‌న అనుభ‌వం చూపించాడు. నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి సాదాసీదా యువ‌తిగా న‌టించింది. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్‌ రత్నం మెప్పించాడు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా తనదైన ముద్ర వేశాడు. లాయర్‌ పాత్రలో రావు రమేశ్‌, బసవయ్య పాత్రలో రాజీవ్‌ కనకాల త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. అమ్ము అభిరామి, నాజర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. నారప్ప విషయంలో ఎలాంటి ప్రయోగాల వైపు వెళ్ల‌కుండా అసుర‌న్ క‌థ‌ను పూర్తిగా వాడేశారు.

కాస్టింగ్ మినహా యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌తో సహా అసురన్ సినిమా నుంచి దింపేసినవే. కథలోని పాత్రలను ఏమాత్రం మార్చకుండా ఎమోషన్స్‌ పండించడంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల సఫలం అయ్యాడ‌నే చెప్పాలి. పాత రోజుల్లో గ్రామంలోని పెద్ద‌లు త‌ప్ప ఎవ‌రూ చెప్పులు వేసుకుంటే అనుమ‌తించేవారు కాదు. ఈ సినిమాలోనూ ఆ స‌న్నివేశాల‌ను చాలా చ‌క్క‌గా చూపించారు. సినిమాలో మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప' లాంటి డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో వ‌చ్చే సీన్లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఓవ‌రాల్ గా చూస్తే నార‌ప్ప వెంక‌టేష్ ఖాతాలో ఓ విజ‌యం ద‌క్కిన‌ట్లే చెప్పొచ్చు.

రేటింగ్. 2.75-5

Next Story
Share it