Telugu Gateway
Movie reviews

'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుల‌ర్' మూవీ రివ్యూ

మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుల‌ర్ మూవీ రివ్యూ
X

అక్కినేని అఖిల్. టాలీవుడ్ లేటెస్ట్ ల‌క్కీ గ‌ర్ల్ పూజాహెగ్డె. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్. ఈ కాంబినేష‌న్ అంటే స‌హ‌జంగానే సినిమాపై అంచ‌నాలు బాగానే ఉంటాయి. ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఈ 'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుల‌ర్ ' శుక్ర‌వారం నాడు విడుద‌లైంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఇప్ప‌టివ‌ర‌కూ అక్కినేని అఖిల్ ఖాతాలో ఒక్క‌టంటే ఒక్క హిట్ ప‌డ‌లేదు. ద‌ర్శ‌కుడు భాస్క‌ర్, హీరోయిన్ పూజా హెగ్డెపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అఖిల్ కు మ‌రోసారి నిరాశే ఎదురైంద‌ని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కు క‌లిసొచ్చిన పూజాహెగ్డె కాళ్లు అఖిల్ ను హిట్ బాట ప‌ట్టించ‌లేక‌పోయాయ‌నే చెప్పాలి. విభా (పూజాహెగ్డె) స్టాండ‌ప్ క‌మెడియ‌న్. ముఖ్యంగా ఆమె కు పెళ్లిపై స్ప‌ష్ట‌మైన అబిప్రాయాలు ఉంటాయి. హ‌ర్ష (అక్కినేని అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇర‌వై రోజులు సెల‌వు దొరికింద‌ని..ఈ గ్యాప్ లో వ‌ర‌స‌గా పెళ్లి సంబంధాలు చూసి..పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్లిపోదామ‌ని ఇండియా వ‌స్తాడు. ఈ పెళ్ళిచూపుల జాబితాలో విభా కూడా ఉంటుంది. కానీ జాత‌కాలు క‌ల‌వ‌లేద‌ని విభా ప్రొఫెల్ ను వెన‌క్కి ఇచ్చేస్తారు. మ‌ధ్య‌లో విభా ఫోటో మిస్ అవ‌టంతో పంచాయ‌తీ మొద‌ల‌వుతుంది. పెళ్లికి ముందే హ‌ర్ష అమెరికాలో ఓ ఇళ్ళు కొన‌టంతోపాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటాడు. సినిమా ఫ‌స్టాఫ్ అంతా పెళ్ళి అయిన వారిపై విభా చేసే స్టాండ‌ప్ కామెడీ జోకుల‌తో..హ‌ర్ష పెళ్ళి చూపుల‌తోనే న‌డిచిపోతుంది. పెళ్లి నుంచి నువ్వు ఏమి ఎక్స్ పెక్ట్ చేస్తున్నావు, నీకు స‌న్ రైజ్ ఇష్ట‌మా? స‌న్ సెట్ ఇష్ట‌మా?, నా బాడీ నాదే కాదు అంటూ విభా అడిగే ప్ర‌శ్న‌లు..చెప్పే డైలాగ్స్ నే హ‌ర్ష తాను వెళ్లిన అన్ని పెళ్ళి చూపుల ద‌గ్గ‌ర ఉపయోగిస్తాడు హ‌ర్ష‌. దీంతోనే చిక్కుల్లో ప‌డ‌తాడు. ఈ వ్య‌వ‌హారం చివ‌ర‌కు కేసు దాకా వెళ్లి కోర్టుకు వెళుతుంది. కోర్టులో వ‌చ్చే సీన్లు కాస్త ప్రేక్షకుల‌కు రిలీఫ్ నిస్తాయి. ఈ పెళ్ళి చూపుల్లో భాగంగానే ఫ‌రియా అబ్దుల్లా, ఈషా రెబ్బా అలా వ‌చ్చి ఇలా పోతారు.

పెళ్ళి అంటే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య స‌ర్దుబాటు కాదు...అంత‌కు మంచి ఏదో కావాల‌ని కోరుకునే అమ్మాయి విభా. ఆ అంత‌కు మించి అనేది ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేసి హ‌ర్ష చివ‌ర‌కు విభాను ఎలా పెళ్ళి చేసుకుంటాడు అన్న‌దే సినిమా. త‌న తండ్రి జీవితంలో చూసిన ప‌రిణామాలు విభాను పెళ్లి విష‌యంలో ఓ నిచ్చిత అభిప్రాయానికి వ‌చ్చేలా చేస్తాయి. అస‌లు పెళ్ళి చేసుకోవాలంటే మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుర‌ల్ గా ఉన్న త‌న‌కు ఇంకా ఏమి అర్హ‌త‌లు కావాలో అర్ధం కాక సంఘ‌ర్ష‌ణ ప‌డే యువ‌కుడిగా అఖిల్ త‌న పాత్ర‌కు న్యాయం చేస్తాడు. స్టాండ‌ప్ క‌మెడియ‌న్ గా పూజా హెగ్డె కొత్త ప్ర‌యోగం చేసింది. అయితే క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌టంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌డ‌బ‌డ్డారు. లెహ‌రాయి పాట త‌ప్ప‌...మిగిలిన పాట‌లు కూడా సో సోగానే ఉన్నాయి. ఓవ‌రాల్ గా చూస్తే 'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుల‌ర్' సినిమా మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం సినిమాను గుర్తుచేస్తుంది. పాత్ర‌లు ఎక్కువ‌..విష‌యం త‌క్కువ‌.

రేటింగ్. 2.25-5

Next Story
Share it