Telugu Gateway
Movie reviews

ఊహించని కాంబినేషన్..మరి ఫలితం?!

ఊహించని కాంబినేషన్..మరి ఫలితం?!
X

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టిల కాంబినేషన్ లో సినిమా అంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. అది కూడా ఒక కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు తో కలిసి. అందుకే అందరూ ఈ సినిమా పై పలు అనుమానాలు పెట్టుకున్నారు. అయితే నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కావటం తో కథలో కొత్తదనం లేకుండా ప్రయోగం చేస్తారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. పలు వాయిదాల అనంతరం ఈ సినిమా కృష్ణాష్టమి సందర్భంగా గురువారం నాడు విడుదల అయింది. ఈ మూవీ కి మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ పెట్టడం కూడా కలిసి వచ్చింది అనే చెప్పాలి. కారణాలు ఏమైనా హీరో నవీన్ పోలిశెట్టి మాత్రమే సినిమా ప్రమోషన్ భారం అంతా మోశారు. అనుష్క శెట్టి ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎక్కడా బయటకు రాకపోవటం కూడా పెద్ద చర్చనీయాంశగా మారింది. సినిమా ప్రమోషన్స్ భారం అంతా నవీన్ పోలిశెట్టి ఎలాగైతే మోశాడో సినిమా భారం అంతటిని కూడా ఆయనే మోశాడు అని చెప్పొచ్చు. అటు హీరో నవీన్ పోలిశెట్టి, ఇటు అనుష్క శెట్టి ల సినిమాలు విడుదల కాక చాలా రోజులు అయిన విషయం తెలిసింది. దీంతో వీళ్లిద్దరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు . మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి సినిమా స్టోరీ లైన్ ఏమీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్టు ఏమీ కాదు. నవీన్ పోలిశెట్టి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ స్టాండప్ కమెడియన్ గా షోస్ చేస్తుంటాడు. అనుష్క ఒక ప్రముఖ హోటల్ లో చెఫ్. తల్లి ప్రేమ పెళ్లి విఫలం అవటంతో అనుష్క కు పెళ్లి మీద ఏ మాత్రం సదభిప్రాయం ఉండదు. అందుకే పెళ్లి చేసుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడదు.

కానీ సంతానం కోసం స్పెర్మ్ డొనేట్ చేసే వ్యక్తి కోసం వెతుకుతుంది. హాస్పిటల్ చూపించిన వాళ్ళ దగ్గరకాకుండా తామే ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకు ఆ యువకుడి అలవాట్లు, ఫ్యామిలీ బాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు. మరి ఈ క్రమంలో అనుష్కకు నవీన్ పోలిశెట్టి ఎలా తారసపడతాడు ...ఈ వ్యవహారంలో సాగిన ట్విస్టులు ఏంటి అన్నదే సినిమా. మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి సినిమా అంతా నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తనదైన కామెడీ మార్క్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. అనుష్క శెట్టి గతంతో పోలిస్తే బాగా లావు తగ్గి ఇందులో క్యూట్ గా కనిపిస్తుంది. కథ అంతా అనుష్క చుట్టూనే తిరిగినా షో అంతా మాత్రం నవీన్ పోలిశెట్టి దే. అనుష్క తల్లిగా జయ సుధ నటించగా..నవీన్ తల్లి తండ్రులుగా మురళి శర్మ, తులసి నటించారు. నవీన్ ఫ్రెండ్ రోల్ లో అభినవ్ గోమటం తన పాత్రకు న్యాయం చేశాడు . సినిమా తొలి పదిహేను నిమిషాలు చాలా స్లో గా ముందుకు సాగుతుంది. ఎప్పుడుడైతే నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇస్తాడో అప్పటినుంచి ఊపు అందుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గినా భావోద్వేగ సన్నివేశాల్లోనూ అనుష్క, నవీన్ పోలిశెట్టి మెప్పిస్తారు. చాలా చాలా సింపుల్ కథను నవీన్ పోలిశెట్టి ఒంటి చేత్తో మోశాడు. చాలా చోట్ల సంభాషణలు అర్ధవంతగా ఉంటాయి. అనుష్క శెట్టి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మొత్తం మీద నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టిల కొత్త సినిమా మంచిగా నవ్విస్తుంది.

రేటింగ్: 2 .75 /5

Next Story
Share it