Telugu Gateway
Movie reviews

'మంచి రోజులొచ్చాయ్' మూవీ రివ్యూ

మంచి రోజులొచ్చాయ్ మూవీ రివ్యూ
X

ద‌ర్శ‌కుడు మారుతి సినిమా అంటే ఏదో ఒక కొత్త‌ద‌నం..కాస్త కామెడీ గ్యారంటీ అన్న భావన ఉంటుంది. అంతే కాదు..ఏదో ఒక లైన్ తీసుకుని సినిమాను స‌ర‌దా స‌ర‌దాగా తెర‌కెక్కిస్తాడు. ఇప్ప‌టికే ఈ విష‌యం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు మారుతి అందించిన క‌థ‌..ద‌ర్శ‌క‌త్వంతో 'మంచి రోజులొచ్చాయ్' సినిమాను తెర‌కెక్కించాడు. ఏక్ మినీ క‌థ సినిమా విజ‌యం త‌ర్వాత సంతోష్ శోభ‌న్ హీరోగా వ‌చ్చిన సినిమా ఇదే. ఈ సినిమాలో ఆయ‌న‌కు జోడీగా మెహ‌రీన్ ఫిర్జాదా న‌టించారు. మ‌రి ఈ సారి కూడా మారుతి త‌న ట్రెండ్ కొన‌సాగించారో లేదో చూద్దాం. ఓ కాల‌నీలో ముగ్గురు స్నేహితులు. అందులో ఇద్ద‌రు స్నేహితులు త‌మ కూతుళ్ల ప్రేమ వ్య‌వ‌హారాలు, ఇత‌ర చికాకుల‌తో సమ‌స్య‌ల్లో కూరుకుపోతారు. కానీ హీరోయిన్ తండ్రి అజ‌య్ ఘోష్ నిత్యం సంతోషంగా, హాయిగా న‌వ్వుతూ ఉంటారు. ఆయ‌న ఎప్పుడూ అలా సంతోషంగా, న‌వ్వుతూ ఉండ‌టం చూడ‌లేక‌పోయినా ఇద్ద‌రు స్నేహితులు ఆయ‌న్ను టెన్ష‌న్ కు గురిచేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. వెంట‌నే రంగంలోకి దిగుతారు. సంతోష్ శోభ‌న్, మెహ‌రీన్ లు బెంగుళూరులో ఓ ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తూ అప్ప‌టికే ప్రేమ‌లో ప‌డ‌తారు. అయితే దేశంలో క‌రోనా కేసు న‌మోదు అయిన వార్త వ‌చ్చిన వెంట‌నే ఆ ఐటి కంపెనీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ప్ర‌క‌టిస్తుంది. దీంతో ఇద్ద‌రూ హైద‌రాబాద్ బ‌య‌లుదేర‌తారు. అప్ప‌టి వ‌ర‌కూ హాయిగా ఉన్న అజ‌య్ ఘోష్ మ‌న‌సులో అనుమానపు భీజాలు నాటుతారు స్నేహితులు ఇద్ద‌రూ. త‌న కూతురు వ‌చ్చేది త‌న స‌హోద్యోగి అయిన అమ్మాయితోనా..అబ్బాయితోనా అన్న అనుమానం వ‌చ్చేలా చేస్తారు. అక్క‌డి నుంచి అస‌లు కథ‌ ప్రారంభం అవుతుంది. త‌న కూతురు ఎవ‌రితోనే ల‌వ్ లో ఉంద‌ని తెలుసుకుని టెన్ష‌న్ కు గుర‌వుతుంటాడు అజ‌య్ ఘోష్ వారు కోరుకున్న‌ట్లుగానే.

అంతే కాదు..త‌మ‌కు లాగే ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని ..అది వ‌చ్చిన కొద్ది నెల‌ల‌కే చ‌నిపోతావ‌ని బెదిరిస్తారు. ఈ సినిమాలో ముగ్గురి స్నేహితుల ఎపిసోడ్ తో ప్రేక్షకుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాడు ద‌ర్శ‌కుడు. చాలా వ‌ర‌కూ ఈ స‌న్నివేశాలు చికాకు తెప్పిస్తాయి. చావుకు భ‌య‌ప‌డి బ‌త‌క‌టం ఎంత క‌ష్ట‌మో..ప‌క్క‌నుండే స్నేహితులు సంతోషంగా ఉన్న వారిని త‌మ శాడిస్టిక్ విధానంతో ఎలా ఇబ్బందుల్లోకి నెడ‌తార‌నే లైన్ లో కొత్త‌ద‌నం ఉన్నా సినిమా న‌డిచిన తీరు మాత్రం ఏ మాత్రం ఆక‌ట్టుకోదు. హీరో, హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆస‌క్తిక‌రంగా లేదు. హీరో సంతోష్ శోభ‌న్ త‌న పాత్ర‌లో ఈజ్ చూపించాడు. మెహ‌రీన్ అయితే కొన్ని సీన్ల‌లో పేషంట్ లా క‌న్పించి షాకిస్తుంది. అక్క‌డ‌క్కడ వెన్న‌ల కిషోర్ కామెడీ ఆక‌ట్టుకున్నా...స‌ప్త‌గిరి, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ ల కామెడీ ట్రాక్ కూడా పెద్ద‌గా నవ్వించ‌లేకపోయింది. ఓవ‌రాల్ గా చూస్తే సినిమా లైన్ లో కొత్త‌ద‌నం ఉన్నా మారుతి సినిమా న‌డిపించిన తీరు మాత్రం ట్రాక్ త‌ప్పింది. మ‌హానుభావులు..ప్ర‌తి రోజూ పండ‌గే వంటి సినిమాల‌తో పోలిస్తే ఆ జోష్ ఎక్క‌డా ఈ సినిమాలో క‌న్పించ‌దు.

రేటింగ్.2-5

Next Story
Share it