Telugu Gateway
Movie reviews

'మ‌హాస‌ముద్రం' మూవీ రివ్యూ

మ‌హాస‌ముద్రం  మూవీ రివ్యూ
X

శర్వానంద్. క‌థ‌ల ఎంపికలో కొత్త‌ద‌నం చూపించే హీరోల్లో ఆయ‌నొక‌డు. సిద్దార్ధ‌ చాలా కాలం త‌ర్వాత తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమా. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్క‌సారిగా ప్రేక్షకుల నోళ్ళ‌లో నానిని వ్య‌క్తి. వీరంద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమానే 'మ‌హాస‌ముద్రం'. ద‌స‌రా సంద‌ర్భంగా గురువారం నాడే విడుద‌ల అయింది. శ‌ర్వానంద్, సిద్ధార్ధ ఇద్ద‌రూ మంచి న‌టులు కావ‌టంతో సినిమాపై ఓ రేంజ్ అంచ‌నాలే ఉన్నాయి. అజ‌య్ భూప‌తి కూడా కొత్త‌త‌రం ద‌ర్శ‌కుడు కావ‌టంతో ప్రేక్షకులు స‌హ‌జంగానే కొత్త‌ద‌నం కోరుకుంటారు. కానీ 'మ‌హాస‌ముద్రం' సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర గంద‌ర‌గోళంలోనుంచే బ‌య‌ట‌కు వ‌స్తారు. ఇక సినిమా అస‌లు క‌థ విష‌యానికి వ‌స్తే వైజాగ్ లో ఉండే అర్జున్ (శర్వానంద్), విజ‌య్ (సిద్ధార్ధ‌)లు మంచి స్నేహితులు. విజ‌య్ పోలీస్ అయి భారీగా డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. అర్జున్ చిన్న వ్యాపారం ఏదైనా ప్రారంభించి జీవితం సాగించాల‌నుకుంటాడు. కానీ పోలీసు అవ్వాల‌నుకున్న విజ‌య్ ఓ హ‌త్య కేసులో ఇరుక్కుని వైజాగ్ ను వ‌దిలిపెట్టి వెళ‌తాడు. కానీ వ్యాపారం చేస్తూ జీవితం సాగించాల‌నుకునే అర్జున్ అనుకోకుండా స్మ‌గ్లింగ్. డ్ర‌గ్స్ విక్ర‌యాల వ్యాపారంలోకి అడుగుపెడ‌తాడు. అర్జున్ మామ చుంచుమామ‌(జ‌గ‌ప‌తిబాబు)ఎలాగైనా వైజాగ్ స‌ముద్రంపై ఆదిప‌త్యం చ‌లాయించాల‌న్న త‌న కోరిక‌ను అర్జున్ ద్వారా తీర్చుకుంటాడు. విజ‌య్, మ‌హా(అదితిరావు హైద‌రీ)ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఏదో ఉంది అంటే ఉంది అన్పిస్తుంది.

కానీ శ‌ర్వానంద్, అను ఇమాన్యుయ‌ల్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఏ మాత్రం ఆక‌ట్టుకోదు. అనుఇమాన్యుయ‌ల్ తో రెండు యాక్సిడెంట్లు చేయించి..హీరోయిన్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోతే హీరోతో ఆ డ‌బ్బు క‌ట్టించి ప్రేమ‌ను చిగురింప‌చేస్తాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కూ ఎక్క‌డా ఈ మూవీలో ప్రేక్షకులు ఇది బాగుంది అని ఫీల‌య్యే స‌న్నివేశాలు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఉండ‌వు. ఇప్ప‌టికే చాలా సినిమాల్లో చూసీచూసి ఉన్న మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ‌వ్యాపారం. స్మ‌గ్లింగ్ కు అడ్డ‌గా వైజాగ్ ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సినిమాలో కాస్తోకూస్తో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర ఎవ‌రిది అయినా ఉంది అంటే..గూని బాబ్జీ(రావు ర‌మేష్‌) దే అని చెప్పొచ్చు. ఆయ‌న మ్యాన‌రిజ‌మ్స్ కొన్ని ఆక‌ట్టుకుంటాయి. శ‌ర్వానంద్ ఈ సారి క‌థ ఎంపిక‌లో దారుణంగా ఫెయిల్ అయ్యాడ‌నే చెప్పొచ్చు. సిద్ధార్ధ కూడా టాలీవుడ్ లో రీఎంట్రీకి ఇది ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డేలా లేదు. సెకండాఫ్ లో కాసేపు నెగిటివ్ షేడ్స్ లో క‌న్పించి హీరోగానే కాదు..ఈ పాత్ర‌ల‌కు రెడీ అనే సంకేతం ఇచ్చిన‌ట్లు ఉంది. ఓవ‌రాల్ గా చూస్తే ద‌స‌రా పండ‌గ స‌మ‌యంలో 'మ‌హాస‌ముద్రం' ప్రేక్షకుల అంచ‌నాల‌ను పూర్తిగా ముంచింది అనే చెప్పాలి.

రేటింగ్. 2-5

Next Story
Share it