Telugu Gateway

'ల‌వ్ స్టోరీ' మూవీ రివ్యూ

ల‌వ్ స్టోరీ మూవీ రివ్యూ
X

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల సినిమా అంటేనే ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంది. మంచి పాత్ర ప‌డాలే కానీ..దుమ్మురేపే హీరోయిన్ సాయిప‌ల్ల‌వి. హీరో నాగ‌చైత‌న్య‌. ఈ సినిమాపై సారంగ‌ద‌రియా పాట పెంచిన అంచ‌నాలు ఓ వైపు. ఇన్ని ప్ర‌త్యేక‌ల‌తో 'ల‌వ్ స్టోరీ' సినిమా శుక్ర‌వారం నాడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా వంద సినిమాలు వ‌స్తే అందులో డెబ్బ‌యి సినిమాలు ప్రేమ‌క‌థ‌లే ఉంటాయి. ఎందుకంటే ఆ క‌థ‌ల‌కు ఉండే డిమాండ్ అలాంటిది మ‌రి. ఈ సినిమా టైటిలే 'ల‌వ్ స్టోరీ'. కానీ ఈ ప్రేమ‌క‌థ‌లో కొత్త‌ద‌నం కంటే సినిమా న‌డిపించిన తీరే ఆస‌క్తిక‌రం. ఉన్న‌త కులాల‌కు చెందిన అమ్మాయిని..నిమ్మ కులానికి చెందిన అబ్బాయిలు ప్రేమించ‌టం...పెళ్ళి చేసుకోవ‌టం చాలా సినిమాల్లో చూసిందే. ఇక సినిమా అస‌లు కథ విష‌యానికి వ‌స్తే ఆర్మూర్ కు చెందిన రేవంత్ (నాగచైత‌న్య‌) హైద‌రాబాద్ లో జుంబా సెంట‌ర్ న‌డుపుతాడు. డ్యాన్స్ ద్వారా ఒత్తిడి త‌గ్గించ‌టంతోపాటు బ‌రువు తగ్గించే సెంట‌ర్ అది. తొలి రోజుల్లో సెంట‌ర్ కు అద్దె క‌ట్టడానికి కూడా నానా క‌ష్టాలు ప‌డ‌తాడు. ఆ స‌మ‌యంలో బీటెక్ చేసి ఐటి ఉద్యోగం వెతుక్కోవ‌టానికి మౌని(సాయిప‌ల్ల‌వి) ప‌క్క ఇంట్లోనే స్నేహితురాలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. ఓ ఐటి కంపెనీలో ప‌నిచేసే ఫ్రెండ్ సాయంతో ముందే పేప‌ర్, ఆన్స‌ర్ షీట్ పొంది ఎలాగైనా ఉద్యోగం పొందాల‌ని చూస్తుంది. కంపెనీ నిర్వ‌హించే రిట‌ర్న్ టెస్ట్ లో మంచి స్కోర్ సాధించినా..ఇంట‌ర్వ్యూలో మాత్రం ఫ‌ట్ మంటుంది. ఆ స‌మ‌యంలోనే రేవంత్ త‌న జుంబా సెంట‌ర్ లో భాగ‌స్వామిగా చేర్చుకుంటాడు మౌనిని. ఆ త‌ర్వాత ఇది ఓ రేంజ్ కు వెళుతుంది. దీనికి మౌనిక సాయంతోపాటు రేవంత్ కూడా త‌న పొలం బ్యాంకులో త‌న‌ఖా పెట్టి పెద్ద డ్యాన్స్ ట్రైనింగ్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తారు. ఆ త‌ర్వాత వీరికి ప్రేమ క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. ఎలాగూ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోర‌ని ఆర్మూర్ లో ఉండే త‌న ఫ్రెండ్ ఎస్ ఐ సాయంతో మౌని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు సీన్ క్రియేట్ చేసి పెళ్ళి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోదామ‌ని ప్లాన్ వేస్తారు.

అంతా రెడీ అయినా త‌ర్వాత మౌనిక ముందు ప్లాన్ చేసిన చెరువు ద‌గ్గ‌ర‌కు రాదు. అస‌లు మౌనిక త‌న బాబాయిని చూసి ఎందుకు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది..గ‌ట్టిగా మాట్లాడితే క‌ళ్ళు తిరిగి ఎందుకు ప‌డిపోతుంది అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ కమ్ముల క్లైమాక్స్ లో రివీల్ చేశారు. జుంబా సెంట‌ర్ లో వ‌ర్షంలో త‌డుస్తూ సాయిప‌ల్ల‌వి వేసే డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. పాట‌లు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్రేక్షకుల నోళ్ళ‌లో నానినందున వాటి ప్ర‌భావం త‌గ్గింద‌నే చెప్పాలి. పాటలు వ‌చ్చిన కొత్త‌లోనే సినిమా విడుద‌ల అయి ఉంటే ఇది మ‌రో రేంజ్ లో ఉండి ఉండేది. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి ప‌లు మార్లు చెప్పిన బ‌ల్లిగాడు, కొండ‌చిలువ‌, నీకు హ‌ర్ట్ లేద‌బ్బా వంటి డైలాగ్ లు ఆక‌ట్టుకున్నాయి. గంగ‌వ్వ సాయిప‌ల్ల‌విని ఉద్దేశించి ఇంత మంచి అమ్మాయి వాడికెట్లా పుట్టిందిరా అంటూ చెప్పే డైలాగ్ హైలెట్. సాయిప‌ల్ల‌వి బాబాయిగా చేసిన రాజీవ్ క‌న‌కాల‌, నాగ‌చైత‌న్య త‌ల్లి పాత్ర‌లో ఈశ్వ‌రీబాయి త‌న పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. నాగ‌చైత‌న్య డ్యాన్స్ తోపాటు న‌ట‌న‌లోనూ త‌న స‌త్తా చాటారు. ఓవ‌రాల్ గా చూస్తే 'ల‌వ్ స్టోరీ' శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ సినిమా.

రేటింగ్. 3.5-5

Next Story
Share it