లైక్, షేర్, సబ్ స్క్రైబ్ మూవీ రివ్యూ
టైటిల్ తోనే సినిమా పై అంచనాలు పెంచారు. లైక్, షేర్, సబ్ స్క్రైబ్ ఈ పేరు ఒక సినిమా టైటిల్ గా పెట్టడం అంటే ఇది ఒకింత సాహసమే అని చెప్పు కోవచ్చు. కాకపోతే యూత్ కు మాత్రమే ఇది ఈజీ గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి ఈ మూడు అంశాలు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ సినిమా తో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన అన్ని మంచి రోజులే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది జాతి రత్నాలు సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లాకి కూడా ఒక మంచి సినిమా దక్కలేదు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ లైక్, షేర్, సబ్ స్క్రైబ్ సినిమా తెరకెక్కింది. హీరో, హీరోయిన్ లు ఇద్దరూ ట్రావెల్ యూట్యూబ్ చానెల్స్ నడుపుతారు. అయితే ఫరియా అబ్దుల్లా ఛానల్ కు మాత్రం 30 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉంటె...అదే హీరో ఛానెల్ కు మాత్రం ఒక మూడు వందల మంది మాత్రమే ఉంటారు. అది కూడా ఎన్నో కష్టాలు పడి సాధిస్తాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే యూట్యూబర్స్ ఇద్దరూ..పీపుల్ ప్రొటెక్షన్ గ్రూప్ (పీపీఎఫ్) అనే నక్సల్స్ చేతికి చిక్కటం...అసలు నక్సల్స్ కు వీళ్లకు సంబంధం ఏమిటి...ఈ సమస్య నుంచి ఎలా బయట పడ్డారు అన్నదే ఈ సినిమా.
యూట్యూబర్స్ ను నక్సల్స్ కథతో లింక్ పెట్టిన విధానం బాగానే ఉన్న ఏ దశలోనూ కథలో స్పీడ్ ఉండదు. సినిమాను ఆసక్తి కరంగా మలచడంలో దర్శకుడు గాంధీ సరైన ప్రయత్నం చేయలేక పోయారు. దీంతో ఎన్నో సానుకూలతలు ఉన్నా సినిమా చప్పగా సాగిపోతుంది. అక్కడక్కడ బ్రహ్మజీ కామెడీ వర్క్ అవుట్ అయినా ఇది సినిమాకు ఏ మాత్రం సరిపోదు అనే చెప్పొచ్చు. హీరో సంతోష్ శోభన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఫరియా అబ్దుల్లా పాత్రను ఆకట్టుకొనేలా తీర్చిదిద్దలేదు. నక్సల్స్ ఇష్యూలో కూడా ఎక్కడా తీవ్రత కనిపించదు. దీంతో సినిమా అంతా ప్రేక్షకులకు చప్పగా సాగిన ఫీలింగ్ వస్తుంది. వినూత్న టైటిల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఆ జోష్ ను మాత్రం సినిమా లో చూపించలేక పోయింది. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులు ఈ సినిమాను సబ్ స్క్రైబ్ చేయటం కష్టమే. ఈ శుక్రవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఊర్వశి వో..రాక్షసివో ఒకటి అయితే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ మరొకటి. నాలుగులో ఈ రెంటిపై కాస్త ఎక్కువ హోప్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయింది. ఈ నాలుగింటిలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న సినిమా అంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ నటించిన ఊర్వశి వో..రాక్షసివో అని చెప్పొచ్చు.
రేటింగ్. 2-5