'లక్ష్య' మూవీ రివ్యూ
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో క్రీడాంశాలతో కూడిన సినిమాల జోరు పెరిగింది. ఒక్క జానర్ క్లిక్ అయింది అంటే చాలు..అందరూ అదే లైన్ తీసుకుని ఓ ప్రయోగం చేద్దామనుకుంటారు. మరి అందరికీ సక్సెస్ లు రావు కదా. అలా రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..కథతోపాటు కథనం కూడా పరుగెత్తాలి. ప్రేక్షకులను సినిమాతో పూర్తిగా కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి. కానీ శుక్రవారం నాడు విడుదలైన నాగశౌర్య కొత్త సినిమా 'లక్ష్య' అందులో పూర్తిగా విఫలమైంది. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ విషయంలో ఏ మాత్రం విజయం సాధించలేకపోయారు. ఇటీవలే వచ్చిన నాగశౌర్య సినిమా వరుడు కావలెను మంచి టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత నాగశౌర్య గాడినపడ్డారనుకున్నారు. కానీ 'లక్ష్య'తో మళ్ళీ పాత కథే పునరావృతం అయింది. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే పార్ధు (నాగశౌర్య) చిన్నప్పుడే తమ ఇంటికి వచ్చిన దొంగను బాణంతో గురిచూసి కొట్టతాడు. దీంతో తన మనవడికి విలువిద్య నేర్పించాలని నిర్ణయం తీసుకుంటాడు తాత సచిన్ ఖేడ్కర్. అంతకు ముందే విలువిద్యలో ప్రపంచ చాంఫియన్ అవుదామనుకున్న నాగశౌర్య తండ్రి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో తన మనవడితో అయినా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తాడు.
దీని కోసం ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ విలువిద్యలో పేరుగాంచిన శిక్షణా సంస్థలో చేరతాడు. ప్రతి చోటా ఆటల్లో ఉండే రాజకీయాలే అక్కడా ఉంటాయి. కానీ అనూహ్యంగా తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాడు. అప్పటికే రాష్ట్రస్థాయి చాంపియన్ గా ఉన్న వ్యక్తి ఓడిపోయి పార్ధు గెలవటంతో ఎలాగైనా విజయం సాధించిన పార్దును దెబ్బకొట్టాలనే టార్గెట్ తో తన స్నేహితుడి బెట్టింగ్ బలహీనతను ఉపయోగించుకుని ఓ స్కెచ్ వేసి డ్రగ్స్ అలవాటు చేసి..ఆటకు దూరం చేస్తారు. ఈ సమస్యలు అన్నింటిని అధిగమించి తన తాత, తండ్రి కల అయిన విలువిద్యలో ప్రపంచ ఛాంపియన్ ఎలా అయ్యాడు అన్నదే ఈ సిసిమా. ఈ సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ చేసినట్లు కన్పిస్తున్నా..ఆ ఫలితం మాత్రం సినిమాలో కన్పించదు. గేమ్స్ సినిమాలో ఉండే ఉత్సుకత..సస్పెన్స్ , థ్రిల్ ను క్రియేట్ చేయటంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా కేతికా శర్మ నటించింది. వీరి లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా ఏమీలేదు. ఓవరాల్ గా చూస్తే 'లక్ష్య' గురితప్పింది.
రేటింగ్. 2.25-5