Telugu Gateway
Movie reviews

దుల్కర్ సల్మాన్ ప్రయోగం ఫలించిందా?!

దుల్కర్ సల్మాన్ ప్రయోగం ఫలించిందా?!
X

టాలీవుడ్ లో ఈ వారం మూడు సినిమా ల హంగామా ఉంది. శుక్రవారం నాడు వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున, కార్తికేయ నటించిన బెదురులంక 2012 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ అఫ్ కొత్త సినిమా గురువారం నాడే విడుదల అయింది. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోల్లో ఒకరు. అయన నటించిన మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికి తెలిసిందే. ఈ సినిమా ల విజయంతో దుల్కర్ కు తెలుగు లో మంచి మార్కెట్ వచ్చినట్లు అయింది. గురువారం నాడు విడుదల అయిన కింగ్ అఫ్ కొత్త సినిమా పూర్తిగా దుల్కర్ సల్మాన్ గత సినిమా లకు భిన్నమైన మూవీ గా చెప్పుకోవచ్చు. కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి గ్యాంగ్ వార్ సినిమాలు ఇప్పటికే ఎన్నో చూసి ఉన్నారనే చెప్పాలి. అయితే దుల్కర్ సల్మాన్ మాత్రం ఇందులో కొత్తగా కనిపించటంతో పాటు గ్యాంగ్ స్టర్ గా సీరియస్ లుక్ లో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. అయితే కథలో కొత్తదనం లేకపోవటం సినిమాలో దుల్కర్ పాత్ర బాగున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఈ సినిమా కథ అంతా కొత్త అనే ఊరు చుట్టూనే తిరుగుతుంది. అక్కడ ఉండే ఒక ముఠా గంజాయి తో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తూ ఉంటుంది . వీళ్ళను అడ్డుకునేందుకు కొత్తగా వచ్చిన సిఐ చేసిన ప్రయత్నాలు విఫలం అవుతాయి.

దీంతో కొత్త లో అడ్డగోలు దందాలు చేస్తున్న కన్నా కు చెక్ పెట్టేందుకు ఒకప్పుడు ఇక్కడే ఉండి ఒక వెలుగు వెలిగిన రాజు తిరిగి కొత్తకు వచ్చేలా చేస్తారు. అసలు కన్నాకు, రాజుకు ఉన్న సంబంధం ఏమిటి...ఒకప్పుడు కొత్త లో కింగ్ గా ఉన్న రాజు ఎందుకు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రాజు ను కొత్త కు తీసుకురావాలన్న పోలీస్ లు వేసిన ఎత్తుగడ ఫలించిందా అన్నదే ఈ సినిమా. అయితే కింగ్ అఫ్ కొత్త లో తెలుగు ప్రేక్షకులు కొత్త దుల్కర్ సల్మాన్ ను చూస్తారు అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ల మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా అకట్టుకోదు. గ్యాంగ్ వార్ లు, ఫ్యామిలీ సెంటిమెంట్, స్నేహం వంటి ఎన్నో కోణాలు ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అభిలాష్ జోషి. కానీ ఏ ఒక్క అంశంలో కూడా విజయం సాధించలేకపోయారు . కాకపోతే రాజు పాత్రలో ఫుల్ మాస్ లుక్ లో దుల్కర్ ప్రేక్షకులను మెప్పిస్తాడు. కానీ కథలో కొత్తదనం లేకపోవటంతో దీని వల్ల పెద్ద గా ప్రయోజనం లేకుండా పోయింది . ఈ సినిమాలో చెప్పుకోదగిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే అది దుల్కర్ యాక్షన్..హీరో ను ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చేలా జెక్స్ బిజోయ్ నేపద్య సంగీతం అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం ఎక్కే అవకాశం లేదు అనే చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ గాడి తప్పినట్లు అయింది.

రేటింగ్:2 /5

Next Story
Share it