'మిస్ ఇండియా' మూవీ రివ్యూ
కీర్తి సురేష్. ఆమె నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహానటి సినిమాతో కీర్తి సురేష్ అభినయంలో ఓ రేంజ్ కు వెళ్ళిపోయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా..కథా బలం ఉన్న సినిమా అయినా సరే సత్తా చాటుతోంది ఈ నటి. బుధవారం నాడు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మిస్ ఇండియా' సినిమా విడుదల అయింది. అది నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరో. సంభాషణలు సెకండ్ హీరో. ఇక మిగిలిన నటులు అంతా అలా వచ్చి ఇలా పోయేవారే. మిస్ ఇండియా సినిమా కూడా కీర్తి సురేష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తందనటంలో సందేహం లేదు. కథ విషయానికి చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలనుకునే అమ్మాయి మానస సంయుక్త (కీర్తి సురేష్). అమ్మాయిలకు వ్యాపారం ఎందుకు అనే ఫ్యామిలీ.
కానీ చివరకు ఆ అమ్మాయి అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి.. అక్కడే అది కూడా ఓ ఛాయ్ షాప్ పెట్టడం. దానికి పడిన కష్టాలు..అందులో ఎదురైన సవాళ్ళు. ఆ అమ్మాయి చాయ్ బిజినెస్ ను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్ధులు వేసిన ఎత్తుగడలు ఇదే సినిమా. సినిమా ప్రారంభం నుంచే అర్ధవంతమైన, ఆలోచింప చేసే డైలాగ్ లతోనే ప్రారంభం అవుతుంది. 'గొప్పతనం అనేది ఓ లక్షణం అది ఒకరు గుర్తించటం వల్ల రాదు..గుర్తించకపోవటం వల్ల పోదు.. ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. కాంప్రమైజ్ అనేది మనల్ని ప్రతి రోజు పలకరించే క్లోజ్ ఫ్రెండ్, అబద్ధం అనేది మన పక్కన ఉండే నైబర్. అడ్జెస్ట్ మెంట్ అనేది మనల్ని వదలని లవర్. కష్టపడి ఒప్పించినా నేను ఇష్టపడని పని చేయను.
ప్రపంచంలో జరిగే గొప్ప విషయాలకు గ్యారంటీ ఏమీ ఉండదు. నమ్మి చేయటమే. గ్రాముల్లో ఇచ్చిన కష్టాన్ని టన్నుల్లో తిరిగిచ్చేస్తా.' వంటి డైలాగ్ లు సినిమాలో ఆకట్టుకుంటాయి. దీంతో పాటు జగపతిబాబు, కీర్తి సురేష్ ల మధ్య వచ్చే కార్పొరేట్ వార్ డైలాగ్ లు, చాయ్ గురించి కీర్తి సురేష్ చెప్పిన తీరు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ఉన్న రెండు పాటలు కూల్ గా సాగిపోతాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు అనుగుణంగా బాగా సెట్ అయింది. దర్శకుడు నరేంద్రనాథ్ తాను అనుకున్న సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లే పూర్తి చేశారు. ముఖ్యంగా మహిళలు తమ కెరీర్ ను ఎంచుకునే క్రమంలో ఎదుర్కొనే కష్టాలను పర్పెక్ట్ గా ఈ సినిమాలో చూపించారు. ఓవరాల్ గా చూస్తే 'మిస్ ఇండియా' మిస్ కాకుండా చూడాల్సిన సినిమానే.
రేటింగ్ 3.5/5