Telugu Gateway
Movie reviews

'జాతిరత్నాలు' మూవీ రివ్యూ

జాతిరత్నాలు మూవీ రివ్యూ
X

'జాతిరత్నాలు'..టైటిల్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించిన తర్వాత ఇది మరింత పీక్ చేరింది. 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమాతోనే అందరి దృష్టి నవీన్ పోలిశెట్టిపై పడింది. ఇక రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల సంగతి అయితే చెప్పక్కర్లేదు. వీళ్ళు ముగ్గురూ కలసి జాతిరత్నాలు అంటే ఏ రేంజ్ లో ఉండాలో అదే రేంజ్ లో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అనుదీప్. ఇక అసలు కథ విషయానికి వస్తే జోగిపేట అనే ఊళ్ళో ఓ కుర్ర గ్యాంగ్. దీనికి నాయకత్వం వహించేది జోగిపేట శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి). శ్రీకాంత్ స్నేహితులే శేఖర్(ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ)లు. చిన్నప్పటి నుంచి ఈ ముగ్గురూ కలసి బలాదూర్‌గా తిరుగుతూ ఇంట్లో వాళ్ళకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంటారు. ఈ గ్రూపు గ్యాంగ్ లీడర్ శ్రీకాంత్ కు లేడీస్ ఎంపోరియం ఉంటుంది. ఇది నడపటం ఏ మాత్రం ఇష్టం లేని శ్రీకాంత్ ఎలాగైనా హైదరాబాద్ చేరుకుని ఉద్యోగాల్లో చేరి సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే ముగ్గురూ హైదరాబాద్ చేరుకుంటారు.

కానీ అనుకోకుండా వారికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఎమ్మెల్యే మురళీశర్మ హత్య కేసులో ఇరుక్కుంటారు. ఈ కేసు నుంచి ఎలా బయటపడతారన్నదే జాతిరత్నాలు సినిమా. ఓ చిన్న లైన్ ను పట్టుకుని దర్శకుడు అనుదీప్ ఈ సినిమా ను పూర్తి ఎంటర్ టైనర్ గా మలిచాడు. కామెడీ కోసం కామెడీ పెట్టినట్లు కాకుండా సినిమా అంతా పక్కా ప్లాన్ తో ..పకడ్బండీ స్క్రీన్‌ప్లేతో సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలు ఎవరి పాత్రలకు వాళ్ళు జీవం పోశారు. ఇందులో ఎక్కువ బాధ్యత నవీన్‌ పోలిశెట్టిదే అని చెప్పొచ్చు. నవీన్‌ బాడీ లాంగ్వేజ్‌, హావభావాలు, డైలాగ్‌ డెలివరీ లు జోగిపేట శ్రీకాంత్‌ క్యారెక్టర్‌కి పర్పెక్ట్ గా సెట్ అయ్యాయి.

తొలి సినిమానే అయినా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కోర్టులో వాదనలు విన్పించే లాయర్ ఫరియా పండించిన వినోదం సూపర్బ్. చాలా రోజుల తర్వాత మళ్లీ బ్రహ్మానందం ఈ సినిమాలో సందడి చేశారు. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా జస్టిస్ బల్వంత్ చౌదరి పాత్రలో ఆకట్టుకున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ లను అతిధి పాత్రల్లో చూపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. జాతిరత్నాలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'నవ్వులే నవ్వులు'. ఈ వరస సెలవుల్లో జాతిరత్నాలు సినిమాతో ఎంజాయ్ చేయవచ్చు.

రేటింగ్.3.25/5

Next Story
Share it