Telugu Gateway
Movie reviews

కార్తి 25 వ సినిమా హిట్టా?!

కార్తి 25 వ సినిమా హిట్టా?!
X

టాలీవుడ్ లో హీరో కార్తీ సినిమాలు ఎప్పటి నుంచో విడుదల అవుతున్నా ఊపిరి సినిమా దగ్గర నుంచి ఈ హీరో తెలుగు ప్రేక్షుకులకు మరింత దగ్గర అయ్యాడు . నాగార్జున తో కలిసి ఊపిరి సినిమాలో కార్తీ చేసిన యాక్షన్ సినిమాలోనే హై లైట్ గా నిలుస్తుంది. ఆ తర్వాత విడుదల అయిన కార్తీ సినిమాలు ఖైదీ, సర్దార్, పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో ఆయన నటన ప్రేక్షుకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీపావళి సందర్భంగా కార్తీ జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ కి జోడి గా అను ఇమ్మానుయేల్ నటించింది. ఈ సినిమా ట్రైలర్..ఇందులో కార్తీ చెప్పే డైలాగులు..వెరైటీ టైటిల్ సినిమాపై అంచనాలు పెంచింది. అదే సమయంలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కూడా పెద్దగా ఏమి లేకపోవటంతో ప్రేక్షుకుల ఫోకస్ అంతా జపాన్ పైనే పడింది. జపాన్ సినిమా లో కథ కంటే కూడా ముందు చెప్పుకోవాల్సింది కార్తీ గురించే. ఎందుకంటే ఈ సినిమాలో కార్తీ యాక్షన్...డైలాగులు చెప్పిన విధానమే సినిమాకు హై లైట్. ఈ సినిమా కు అసలు జపాన్ అనే పేరు ఎందుకుపెట్టారు అనే ప్రశ్న ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో రావటం సహజమే. అందుకే ఈ టైటిల్ కు కార్తీ డైలాగు తో దర్శకుడు రాజు మురుగన్ ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా అదిరింది అనే చెప్పాలి. సినిమా అంతా కార్తీ వన్ మ్యాన్ షో గానే సాగుతుంది.

ఇక కథ విషయానికి వస్తే జపాన్ బంగారం దొంగతనాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక సారి ఏకంగా ఒక షాప్ నుంచి రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే బంగారం..వజ్రాలు చోరీ చేస్తాడు. ఈ బంగారం షాప్ లో ఒక మంత్రి తో పాటు మరి కొంతమందికి భాగస్వామ్యం ఉండటంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. మరి నిజంగా ఈ షాప్ లో దొంగతనం జపానే చేశాడా..పోలీసులు ఎలా దీన్ని ట్రేస్ చేశారు అన్నదే సినిమా. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోయినా కార్తీ స్టైల్ యాక్షన్...డైలాగులతో జపాన్ సినిమాను దర్శకుడు రాజు మురుగన్ బాగానే నడిపించాడు అని చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ సినిమాలో ఎన్నికలు..రాజకీయాల మీద జపాన్ చెప్పే డైలాగులు అదిరిపోయాయి. జపాన్ పాత్రలో కార్తీ చేసే కామెడీ నే సినిమాకు హై లైట్ గా చెప్పుకోవాలి. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ పాత్ర చాలా పరిమితంగానే ఉంటుంది. పుష్ప సినిమా దగ్గర నుంచి సునీల్ పాత్రలు మారిపోతున్నాయి. ఈ జపాన్ సినిమా లో కూడా సునీల్ మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇది కార్తీ 25 వ సినిమా. జివి ప్రకాష్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జపాన్ సినిమా దీపావళి ఎంటర్ టైనర్.

రేటింగ్: 2 .75 /5

Next Story
Share it