Telugu Gateway
Movie reviews

'హంట్' మూవీ రివ్యూ

హంట్ మూవీ రివ్యూ
X

సమ్మోహనం సినిమా తర్వాత హీరో సుధీర్ బాబుకు సరైన హిట్ సినిమా లేదు. మధ్యలో శ్రీదేవి సోడా సెంటర్ కాస్త ఓకే అనిపించింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తో పాటు అంతకు ముందు వచ్చిన సినిమాలు అన్ని సో సో గా నే నడిచాయి. ఇప్ప్పుడు హంట్ సినిమాతో జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది సుధీర్ బాబు కొత్త సినిమా. ఈ సినిమాలో సుధీర్ బాబు తో పాటు శ్రీకాంత్, భరత్ లు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ కి ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకుల దగ్గర ఉన్న డబ్బులు అన్ని సంక్రాంతి సినిమాలు వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలే పట్టుకెళ్ళాయి. ఈ రెండు సినిమాలకే బుధవారంనాటికి 331 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. దీంతో ప్రేక్షకులు ఇప్పుడు సినిమా బాగుంది అంటేనే తప్ప థియేటర్లకు రావటానికి సిద్ధంగా లేరనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హంట్ సినిమా విషయంలో ఇదే కనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ముగ్గురు పోలీస్ అధికారుల కథ. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. కానీ ఒక అవార్డు తీసుకుంటున్న తరుణంలో ఈ ముగ్గురు స్నేహితుల్లో ఒకరైన భరత్ దారుణ హత్యకు గురవుతారు.

సహచర పోలీస్ అధికారి హత్యకు కారణం ఏంటో తెలుసుకునే విచారణ బాధ్యతను సుధీర్ బాబు తీసుకుంటారు. ఎంతకూ ఇది తేలక పోవటంతో ప్రభుత్వంపై, పోలీస్ డిపార్ట్మెంట్ పై ఒత్తిడి పెరుగుతుంది.ఈ కేసు విచారణ మధ్యలోనే సుధీర్ బాబు ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. తన పై ఉన్నతాధికారి, తన స్నేహితుడు శ్రీకాంతే కావటంతో విచారణ బాధ్యత సుధీర్ బాబు దగ్గరే ఉంటుంది. ఈ హంట్ సినిమా లో క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించరు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్...క్లైమాక్స్ ఎవరికీ అందనిది. అయితే సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు మూవీ చాలా చాలా స్లో గా సాగుతుంది. ప్రేక్షకులకు ఇది ఒకింత పరీక్షగా మారుతుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ మాత్రం థియేటర్లో ఉన్నవాళ్లను షాక్ కు గురిచేస్తుంది. సుధీర్ బాబు ఈ పాత్రకు ఒప్పుకుని ఒకింత సాహసమే చేశారు అని చెప్పొచ్చు. అయితే సినిమా హిట్ కావటానికి క్లైమాక్స్ ఒక్కటే చాలదుగా. హంట్ సినిమా టైటిల్ జస్టిఫికేషన్ ఏమో కానీ... ఇది ప్రేక్షుకులను వేటాడినట్లు ఉంది. అయితే సుధీర్ బాబు మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి.

రేటింగ్; 2 . 25 / 5

Next Story
Share it