Telugu Gateway
Movie reviews

టైటిల్ వెరైటీ...మరి సినిమాలో వెరైటీ ఉందా?

టైటిల్ వెరైటీ...మరి సినిమాలో వెరైటీ ఉందా?
X

ఈ టైటిలే వెరైటీ గా ఉంది. హీరో అశ్విన్ చాలా గ్యాప్ తర్వాత వెరైటీ టైటిల్ తో వస్తుంటే ఖచ్చితంగా కథలో కొత్తదనం ఉంటుంది అని ఆశిస్తారు ప్రేక్షకులు. ఈ వారం చాలా చిన్న సినిమాలు విడుదల అవుతుండటంతో అందరికంటే ఒక రోజు ముందే అంటే గురువారం నాడే హిడింబ విడుదల అయింది. టాలీవుడ్ లో ఇప్పటికే అమ్మాయిల కిడ్నాపులు..వాటిని ఛేదించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీలు చాలానే వచ్చాయి. అయితే ఈ సినిమా విషయానికి వస్తే పాత కథకే ఒక ఆదిమ జాతికి ముడి పెట్టి స్టోరీ రాసుకున్న తీరు ఆకట్టుకున్నా.. దీన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దటంలో దర్శకుడు అనిల్ కన్నెగంటి తడబడ్డారు. హీరో అశ్విన్, నందిత శ్వేతా పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే ప్రేమలో పడతారు. తర్వాత నందిత ఐపీఎస్ కు సెలెక్ట్ అయి కేరళకు వెళుతుంది. సంచలనం సృష్టించిన వరస అమ్మాయిల కిడ్నాప్ అంశాన్ని ఛేదించటానికి ఆమెను పిలిపించి ఒక సిట్ ఏర్పాటు చేస్తారు. ఆ టీం కు సహకరించే బాధ్యతను అశ్విన్ బ్యాచ్ కు అప్పగిస్తారు. కేవలం రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు...దీని వెనక ఉన్న కథ ఏమిటి అన్నదే ఈ సినిమా. అండమాన్ దీవుల్లో ఉన్న ఆదిమ జాతికి చెందిన హిడింబ తెగ మనుషుల నేపథ్యంలో ఈ సినిమా తెర కెక్కటంతో ఈ టైటిల్ కు జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ...ఈ సినిమాలో వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిలను చంపి తినేసే సీన్లు ప్రేక్షుకులను షాక్ కు గురి చేస్తాయనే చెప్పొచ్చు.ఒక సారి ఇలా కిడ్నాప్ అయిన వారిని రాజకీయ నాయకుల అండదండలతో నడిచే ఒక ఆస్పత్రిలో మానవ అవయవాల వ్యాపారం చేస్తున్నట్లు చూపిస్తారు. మరో వైపు హిడింబ తెగకు చెందిన వ్యక్తి ఈ సమాజంలోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నట్లు చూపించి ప్రేక్షుకులను గందరగోళానికి గురి చేస్తారు.

కిడ్నాప్ ముఠాను పట్టుకునేందుకు అశ్విన్ కాలాబండా ప్రాంతానికి వెళ్లిన సమయంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కేరళ నేపథ్యంలో సాగే విచారణ...పోలీస్ అధికారిగా ఉన్ననందిత శ్వేతా తండ్రి కూడా వీళ్ల చేతుల్లోనే చనిపోవటం...అసలు ఇది అంతా చేసింది ఎవరు అని తెలుసుకునే క్రమంలో విషయాల వెలికితీత ఆసక్తికరంగానే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాల తో పాటు ప్రీ క్లైమాక్స్ కూడా ఒకింత ఆసక్తి రేపుతుంది. ఈ సినిమాలో హీరో అశ్విన్ పోలీస్ అధికారిగా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. దీనికోసం హీరో సిద్ధం అయిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ నందిత శ్వేతా కూడా ఐపీఎస్ పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో వీళ్ళ లవ్ ట్రాక్ లో ఏ మాత్రం కొత్తదనం ఉండదు. సస్పెన్స్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా లకు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే. హిడింబ సినిమాలో మాత్రం బాక్గ్రౌండ్ మ్యూజిక్ హై లైట్ గా నిలిచింది. అయితే ఓవర్ అల్ గా చూస్తే మాత్రం సినిమాలో హింస ను..మానవమృగాలుగా వ్యవహరించే వాళ్ళను చూసి తట్టుకోవాలంటే చాలా దైర్యం కావాల్సిందే. క్లైమాక్స్ లో దర్శకుడు హిడింబ జాతి కంటే మానవ అవయువలతో వ్యాపారం చేసే వాళ్లే అత్యంత ప్రమాదకరం అనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు . హిడింబ మూవీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకే తప్ప సామాన్య ప్రేక్షుకులకు ఏ మాత్రం కాదు అనే చెప్పాలి.

రేటింగ్: 2 .25 /5

Next Story
Share it