Telugu Gateway
Movie reviews

తొలి సినిమాతోనే సత్తా చాటిన దర్శకుడు

తొలి సినిమాతోనే సత్తా చాటిన దర్శకుడు
X

టాలీవుడ్ లోని విలక్షణ నటుల్లో హీరో నాని ఒకరు. కథలో దమ్ము ఉండాలే కానీ దానికి వంద శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాడు. అందుకే నాని కి నేచురల్ స్టార్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ హీరో దసరా పేరుతో వంద శాతం మాస్ మూవీ చేశారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందనే దక్కింది. ఇప్పుడు అందుకు పూర్తి బిన్నంగా హాయ్ నాన్న తో ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. హాయ్ నాన్న సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే టెంపో తో సాగుతుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో ఒక ఫోటో గ్రాఫర్. తన కెరీర్ కోసం ప్రొఫైల్ బిల్డ్ అప్ చేయటానికి కనిపించిన వాళ్ళ ఫోటో లు తీస్తూ ఉంటాడు. అలాగే అనుమతి లేకుండా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫోటో లు కూడా తీస్తాడు. దీంతో ఆమె తొలుత పోకిరి అనుకుని పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తుంది...తర్వాత కెమెరాలో అన్ని ఫోటో లు చూసి నిజం తెలుసుకుని వదిలేస్తుంది. అయితే ఆ సమయంలో హీరో ఆమె ముందు ప్రేమ ప్రపోజల్ పెడతాడు. అలా వీళ్ళు స్నేహితులుగా...తర్వాత ప్రేమికులుగా మారతారు. పెళ్లి తర్వాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంతో సినిమా కథ అంతా మారిపోతుంది. ఆ తర్వాత అసలు సినిమా కథ మొదలు అవుతుంది. అయితే కథ అంతా బేబీ కియారా చుట్టూనే ఎందుకు తిరుగుతుంది...దీని వెనక ఉన్న కారణం ఏమిటి అన్నదే సినిమా.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నాని వన్ మ్యాన్ షో. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, బేబీ కియారా లు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ పాత్రలో..లుక్ పరంగా నాని పర్ఫెక్ట్ గా ఉన్నాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. బేబీ కియారా కూడా తన పాత్రలో చాలా బాగా చేసింది. హాయ్ నాన్న సినిమా క్లైమాక్స్ లో ప్రేక్షకులు కంట తడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. సినిమా అంతా ఎక్కువ భావోద్వేగ సన్నివేశాలతోనే సాగుతుంది. ఈ సినిమా కు కథ అందించటం తో పాటు దర్శకత్వం వహించింది శౌర్యువ్. తొలి సినిమానే అయినా కూడా ఎక్కడా గందరగోళం లేకుండా తెరకెక్కించడంలో దర్శకుడు శౌర్యువ్ విజవంతం అయ్యారనే చెప్పాలి. కథ దగ్గరకు వస్తే కొన్ని పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. అయినా కూడా తాను అనుకున్న లైన్ లో హాయ్ నాన్న ను ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారు. చాలా చోట్ల భావోద్వేగ సన్నివేశాలతో సినిమాను నడిపించారు. ఈ సినిమా లో ప్రియ దర్శి, జయరాం, శృతి హాసన్ కీలకపాత్రలు పోషించారు. హాయ్ నాన్న మూవీ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా మూవీ.

రేటింగ్: 3 /5

Next Story
Share it