Telugu Gateway
Movie reviews

ఢీ కొట్టి నిలబడ్డారు (Hanu man Movie Review )

ఢీ కొట్టి నిలబడ్డారు  (Hanu man Movie Review )
X

ఈ సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ చర్చ జరిగింది హనుమాన్ సినిమాపైనే. ఎందుకంటే టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న మహేష్ బాబు సినిమా...అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం విడుదల అవుతున్న జనవరి 12 నే ఇది కూడా విడుదల కావటం ఒక సంచలనం అనే చెప్పాలి. అసలు వీళ్ళ దైర్యం ఏంటి అన్న చర్చ జరిగింది...పరిశ్రమలో సర్దుబాటు చర్చల్లో తేదీ మార్చుకోవాలనే ప్రతిపాదన వచ్చినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకొచ్చారు. ఈ మొండి దైర్యం కూడా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది . సహజంగా ఎంత దైర్యం లేకపోతే మహేష్ బాబు సినిమాను ఢీకొడతారు అనే చర్చ పరిశ్రమ వర్గాల్లో రావటం సాధారణం అనే విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా జనవరి 12 నే విడుదల అయింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పిల్లలకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లా సాహసాలు చేయాలనే కోరికలు ఉంటాయి. చిన్నప్పటినుంచే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు వినయ్ రాయ్. తాను అనుకున్నట్లు ఈ పనులు చేయటానికి తల్లిదండ్రులు సహకరించటం లేదు అని చివరకు వాళ్ళను చంపేస్తాడు. దీనికోసం మరో స్నేహితుడితో కలిసి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ దశలో అంజనాద్రి అనే గ్రామంలో ఉండే హీరో తేజ సజ్జా కు అత్యంత శక్తివంతం అయిన మణి దొరుకుతుంది. అది చేతిలో ఉంటే ఎంత పెద్ద శక్తిమంతుడిని అయినా ఎదిరించవచ్చు అన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మణితో ఆంజనేయకుడికి ఉన్నంత శక్తి వస్తుంది. అసలు ఆ మణి హీరో చేతికి ఎలా దక్కుతుంది...హీరో దగ్గర నుంచి చిన్నప్పటినుంచే సూపర్ మ్యాన్ గా ఎదగాలనే కలలు కనే వినయ్ రాయ్ దీన్ని దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలే హనుమాన్ మూవీ.

హనుమాన్ సినిమాలో స్టోరీ లైన్ కంటే పవర్ ఫుల్ మణి చుట్టూ అల్లిన కథే ఆకట్టుకుంటుంది. ఒక ఊరిలో అల్లరిచిల్లరగా తిరిగే యువకుడి చేతిలోకి మణి వచ్చిన తర్వాత ఆ ఊరిని ఎలా కాపాడుతాడు...దీన్ని ప్రమాదకర వ్యక్తులకు చిక్కకుండా ఎలా రక్షించాడు అన్నదే కథ. తొలుత సినిమా కాస్త స్లో గా కదులుతున్న భావన కలిగినా క్రమక్రమంగా సినిమా వేగం పుంజుకుంటుంది. తేజ సజ్జా హనుమంతు పాత్రలో ఆకట్టుకున్నాడు. సూపర్ పవర్ వచ్చిన సమయంలో చేసే యాక్షన్స్ తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అమృత అయ్యర్ నీట్ గా..సినిమా కథ కు అనుగుణంగా పర్ఫెక్ట్ గా కనిపించింది. విలన్ గా కనిపించిన వినయ్ రాయ్, హీరో తేజ అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు కూడా సినిమాలో హైలైట్ గా ఉంటాయి. మరో కీలక పాత్రలో సముద్రఖని తన పవర్ ఫుల్ డైలాగులతో సినిమాపై తనదైన ప్రభావం చూపించారు. అంజనాద్రి అనే గ్రామంలో భారీ హనుమంతుడి విగ్రహం..చుట్టూ పచ్చటి కొండలు..జలపాతాలతో కూడా గ్రాఫిక్స్ అదరగొట్టాయి. ఇవే సినిమాకు హై లైట్. సూపర్ హీరో కావాలనుకునే ఒక యువకుడి ప్రయత్నానికి..ఇతిహాసానికి ముడి పెట్టి దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో ఒక కోతి పాత్రకు రవి తేజ వాయిస్ ఓవర్ ఇప్పించారు. కోతికి, హీరో కి మధ్య సాగే సన్నీ వేశాలు కామెడీగా ఉంటాయి. సత్య కామెడీ కూడా ఆకట్టుంటుంది. పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కలిసి హాయిగా చూసే సినిమా హనుమాన్.

రేటింగ్ ; 3 .25 / 5

Next Story
Share it