Telugu Gateway
Movie reviews

గుంటూరు కారం మూవీ రివ్యూ (Guntur karam movie review )

గుంటూరు కారం మూవీ రివ్యూ  (Guntur karam movie review )
X

సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ హైప్ వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది గుంటూరు కారమే. దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కావటం...నిర్మాణ సంస్థ హాసినీ అండ్ హారిక క్రియేషన్స్ కావటం మరొకటి. ఎందుకంటే ఈ నిర్మాణ సంస్థ సినిమాల విషయంలో ఏ మాత్రం రాజీపడదు. ఈ పండగ సినిమాల విషయానికి వస్తే అందరి కళ్ళు మహేష్ బాబు సినిమాపైనే ఉన్నాయనే చెప్పాలి. తెలంగాణ లో అయితే ఒంటి గంట నుంచే ప్రత్యేక షోస్ తో ఈ సినిమా సందడి ప్రారంభం అయింది. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు అన్నీ ఒక లైన్ చుట్టే తిరుగుతుంటాయి;..ఆస్థి పత్రాలపై సంతకాలు...కంపెనీలను బలవంతంగా తీసుకునే వాళ్ళతో హీరో ఆడుకోవటం వంటివి ఇప్పటికే పలు సినిమాల్లో చూశాం. అత్తారింటికి దారేది దగ్గర నుంచి...సన్ అఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం అన్నిటి లైన్ ఇంచుమించు ఒకటే. ప్రతి సినిమాలో పాత్రలు కూడా అలాగే ఉంటాయి. గుంటూరు కారం విషయంలో కూడా దర్శకుడు ఇదే లైన్ తీసుకుని కథ నడిపించేశాడు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే రాజకీయాలను ముడిపెట్టి...ఇక్కడ మరో ఒప్పందాన్ని తెరమీదకు తెస్తారు. దీంతోనే అక్కడక్కడ తనదైన స్టైల్ డైలాగులతో సినిమాను నడిపిస్తాడు. అయితే గత సినిమాలతో పోలిస్తే గుంటూరు కారం సినిమా ను అంత గ్రిప్పింగ్ గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు అనే చెప్పాలి.

పాత కథలనే కొత్తగా చెప్పటంలో విజయవంతం అయ్యే త్రివిక్రమ్ ఈ సారి తడపడ్డాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా రమ్య కృష్ణ , తండ్రిగా జయరాం నటించాడు. మహేష్ చిన్నప్పుడే వీళ్ళిద్దరూ విడిపోవటంతో గుంటూరు లో మేనత్త ఈశ్వరి రావు దగ్గర పెరుగుతాడు మహేష్ బాబు . మరి తాను ఎంతో ప్రేమించే తల్లిని హీరో కలుసుకున్నాడా...వాళ్ళు అడిగినట్లు ఒప్పందంపై సంతకం చేశాడా లేదా అన్నదే సినిమా కథ. కథలో దమ్ము కంటే ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్ కీలకం అని చెప్పాలి. పూర్తి మాస్ లుక్ తో ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ తో మహేష్ బాబు ఇందులో కొత్తగా కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గుంటూరు కారం మహేష్ బాబు వన్ మ్యాన్ షో. డాన్స్ విషయంలో కూడా ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త మహేష్ బాబును చూస్తారు అనే చెప్పొచ్చు. మరో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి పాత్ర చాలా పరిమితమే. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, జగపతి బాబు , వెన్నెల కిషోర్ లు తమ తమ పాత్రల్లో ఆకట్టుకుంటారు. హీరోయిన్ శ్రీ లీల కు ఇందులో యాక్షన్ పరంగా చెప్పుకోవాల్సింది ఏమీలేదు గానీ, తన డ్యాన్స్ లతో అదరగొట్టింది. పాటల్లో కుర్చీ మడత పెట్టి సాంగ్ కు మాత్రం థియేటర్స్ లో ఒకటే హడావిడి. మొత్తం మీద గుంటూరు కారం సినిమా విషయంలో హైప్ తప్ప సినిమాలో ఘాటు తగ్గింది అనే చెప్పాలి.

2.5/5 రేటింగ్

Next Story
Share it