'గల్లీ రౌడీ' మూవీ రివ్యూ
కరోనా భయం నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు. అందుకే సినిమాలు కూడా వరస పెట్టి మరీ విడుదల అవుతున్నాయి. ఈ శుక్రవారం నాడు చాలా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో 'గల్లీ రౌడీ' ఒకటి. ఈ సినిమాలో సందీప్ కిషన్, ఆయనకు జోడీగా నేహశెట్టి నటించారు. హీరో సందీప్ కిషన్ కు చిన్నఅప్పటి నుంచే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని కోరిక. కానీ వాళ్ల ఫ్యామిలీలో మంచి పనులు చేయటం కోసం రౌడీలు అయినా పర్వాలేదు అన్నట్లు సందీప్ కిషన్ తాత నుంచి తండ్రి వరకూ అందరూ రౌడీలే అవుతారు. అందుకే చిన్నప్పటి నుంచే సందీప్ కిషన్ ను చదువు మాన్పించి మరీ రౌడీగా మార్చేందుకు అన్ని విద్యలు నేర్పిస్తారు. కానీ సందీప్ కిషన్ ఆ దిశగా ఎప్పుడూ ఫోకస్ పెట్టడు. కానీ ఓ సారి తన ప్రేయసి చిక్కుల్లో పడినప్పుడు ఆమెను కాపాడేందుకు రౌడీ అవతారం ఎత్తి..మరో రౌడీషీటర్ ను కొడతాడు. అక్కడ నుంచి హీరో గల్లీ రౌడీగా నమోదు అవుతాడు. హీరోయిన్ తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్. కానీ వైజాగ్ లో పేరు మోసిన రౌడీ కానిస్టేబుల్ స్థలాన్ని కూడా కబ్జా చేస్తాడు. అమ్ముకుంటే రెండు కోట్ల రూపాయలు వచ్చే స్థలాన్ని కోల్పోవటంతో రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు అందరూ ఆ రౌడీని కిడ్నాప్ చేసి రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు.
ఈ క్రమంలో రౌడీని కిడ్నాప్ చేయాలనుకుంటుండగా..ఎవరో హత్య చేస్తారు. ఊహించని ఈ పరిణామంతో అవాక్కు అయిన వారు అక్కడ ఉన్న రెండు కోట్ల రూపాయలను తీసుకుని పరార్ అవుతారు. ఈ కేసు తేల్చటానికి వచ్చిన సీఐ ఆ రౌడీ రెండో భార్య కొడుకు కావటంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అసలు వైజాగ్ లో కబ్జాలు చేసిన పేరు మోసిన రౌడీని హత్య చేసింది ఎవరు..రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అసలు ఈ హత్య నుంచి ఎలా బయట పడింది అన్నదే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే గల్లీ రౌడీ సినిమాను రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ లు తమ కామెడీతో నడిపించేశారు. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోగా..ఏదో తప్పదు కాబట్టి పెట్టినట్లు ఉంది. డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి సందీప్ కిషన్ ను రౌడీగా చూపించాలనుకునే ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఆ విషయం తెలిసే గల్లీ రౌడీ అని టైటిల్ పిక్స్ చేసినట్లు ఉంది. ఒవరాల్ గా చూస్తే 'గల్లీ రౌడీ' ఓ టైమ్ పాస్ మూవీ.
రేటింగ్. 2.25-5