Telugu Gateway
Movie reviews

'గని' మూవీ రివ్యూ

గని మూవీ రివ్యూ
X

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమా త‌ర్వాత వ‌రుణ్ తేజ్ చేసిన మూవీ 'గని'. స్పోర్ట్స్ క‌థాంశాలు తెలుగులోనూ మంచి విజ‌యం సాధిస్తుండ‌టంతో ఈ హీరో కూడా దీని ద్వారా ఓ ప్ర‌యోగం చేసిన‌ట్లు క‌న్పించింది. ప‌లు వాయిదాల అనంత‌రం ఈ సినిమా ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ సినిమాలో భారీ తారాగ‌ణం ఉండ‌టంతో మూవీపై అంచ‌నాలు కూడా అంతే రేంజ్ లో ఉన్నాయి. వ‌రుణ్ తేజ్ తోపాటు ఉపేంద్ర‌, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర, న‌దియాలు ఉన్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్‌కు జోడిగా సయీ మంజ్రేకర్‌ నటించింది. వ‌రుణ్ తేజ్ ఈ సినిమాలో తొలిసారి బాక్స‌ర్ గా క‌న్పించాడు. అయితే ఈ సినిమాలో స్పోర్ట్స్ డ్రామాను ర‌క్తిక‌ట్టించేందుకు అవ‌స‌ర‌మైనంత స‌త్తా లేక‌పోవ‌టంతో ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ సినిమా అంతా అలా సో సో గానే సాగుతుంది. సినిమా అస‌లు క‌థ విష‌యానికి వ‌స్తే గ‌ని (వ‌రుణ్ తేజ్) తండ్రిగా ఉపేంద్ర‌, త‌ల్లిగా న‌దియాలు న‌టించారు. ఉపేంద్రకు బాక్సింగ్ అంటే ఎంతో ఆస‌క్తి. ఆట‌పై ప్రేమ‌తో ఉద్యోగాన్ని వ‌దిలేసుకుని మ‌రీ నేష‌న‌ల్ చాంఫియ‌న్ సాధించేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే కోచ్ గా ఉన్న జ‌గ‌ప‌తిబాబు చేసిన మోసంతో డ్ర‌గ్స్ తీసుకుని బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌వుతాడు. అంతే కాదు..మోతాదుకు మించి డ్ర‌గ్స్ ఇచ్చి ఉపేంద్ర ప్రాణాలు పోవ‌టానికి కూడా కార‌ణం అవుతాడు కోచ్. అయితే తండ్రి కార‌ణంగా స్కూల్ లో చ‌దువుకునే గ‌ని చిన్న‌ప్పుడే తీవ్ర అవ‌మానాలు ఎదుర్కోంటాడు.

దీంతో త‌ల్లి న‌దియా కూడా పెద్ద‌య్యాక బాక్సింగ్ వైపు వెళ్ళ‌న‌ని కొడుకు ద‌గ్గ‌ర మాట తీసుకుంటుంది. కానీ గ‌ని మాత్రం చదువుకుంటూనే బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటాడు. మ‌రి గ‌ని నేష‌న‌ల్ చాంఫియ‌న్ గా ఎలా ఎదుగుతాడు..త‌న తండ్రి చావుకు కార‌ణ‌మైన వ్య‌క్తే చివ‌ర‌కు ఇండియ‌న్ బాక్సింగ్ లీగ్ (ఐబీఎల్) నిర్వాహ‌కుడిగా మారి త‌న ఓట‌మికి చేసే ప్ర‌య‌త్నాల‌ను గ‌ని ఎలా అధిగ‌మించాడు అన్న‌దే సినిమా. వ‌రుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ ల ల‌వ్ ట్రాక్ ఏ మాత్రం వ‌ర్కవుట్ కాలేదు. అదే స‌మ‌యంలో ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ ఎక్క‌డా కూడా సినిమాలో స్పోర్ట్స్ డ్రామాలో థ్రిల్..స‌స్పెన్స్ క‌న్పించదు. ఫ‌స్టాఫ్ సినిమా అంతా చాలా స్లోగా సాగుతుంది. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఓ మోస్త‌రుగా బెట‌ర్ అని చెప్పొచ్చు. రొటీన్ క‌థ‌తో..ఇప్ప‌టికే ఎన్నో సినిమాల్లో చూసిన సీన్ల‌తో ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి సినిమాను న‌డిపించాడు. సినిమాలో అక్క‌డ‌క్క‌డ థ‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ కాస్త ఊపు తెస్తుంది. త‌మ‌న్నా ఐటెం సాంగ్ తోపాటు ఇత‌ర పాట‌లు కూడా ఏమంత ఆక‌ట్టుకునేలా లేవు. ఒక్క మాట‌లో చెప్పాలంటే గ‌ని సినిమా అత్యంత సాదాసీదా స్పోర్ట్స్ డ్రామా.

రేటింగ్. 2-5

Next Story
Share it