Telugu Gateway
Movie reviews

'గాలి సంపత్' మూవీ రివ్యూ

గాలి సంపత్ మూవీ రివ్యూ
X

ఈ సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ ఉంది. కానీ ప్రేక్షకులు టైటిల్ ను ఓ మైనస్ గా భావించే ప్రమాదం కూడా ఉంది. అయితే అన్నింటి కంటే టాక్ ముఖ్యం. సినిమా బాగుంది అన్న టాక్ వస్తే టైటిల్ పెద్ద సమస్య కాబోదు. ఇక అసలు విషయానికి వస్తే ఈ గాలి సంపత్ సినిమా అంతా అరకులోనే సాగింది. ముగ్గురి చుట్టూనే తిరిగింది. అందులో కీలక పాత్రలు రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, సత్య. ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే రాజేంద్రప్రసాద్ ఓ సారి స్కూటర్ పై వస్తుండగా.. భారీ వర్షం...ఆ వర్షంలో పెద్ద ప్రమాదం. అక్కడే ఆయన వోకల్ కార్డు దెబ్బతింటుంది. భార్య అక్కడికి అక్కడే చనిపోతుంది. గొంతులో నుంచి గాలి తప్ప..మాట రాకపోయినా సరే తనకు ఎంతో ఇష్టమైన నటన కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడూ గాలి సంపత్ పక్కన ఉండే సత్య ట్రాన్స్ లేటర్ గా వ్యవహరిస్తుంటాడు. గాలి సంపత్ కొడుకు అయిన శ్రీవిష్ణు ఓ వ్యాన్ నడుపుతూ ఎలాగైనా సొంత వ్యాన్ కొనుక్కుని సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంటాడు. కొడుకుకు సాయం చేద్దామని తండ్రి..తండ్రి సాయం లేకుండా ఎలాగైనా స్వయంగా వ్యాన్ కొనుక్కుని పెళ్లి చేసుకోవాలని శ్రీవిష్ణు ప్రయత్నాలు చేస్తుంటాడు.

అయితే తన కొడుకు ప్రేమించిన సర్పంచ్ కూతురిని ..తానే దగ్గర ఉండి వేరే అబ్బాయికి లైన్ లో పడేలా ప్రేమలేఖలు రాయించటం వంటి పనులు చేస్తుంటాడు. అయితే ఈ ప్రేమ లేఖల కోసం రక్తం తీసుకునే సీన్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. అంతే కాదు..రాజేంద్రప్రసాద్ చెప్పినట్లు ఈ సినిమాలో ఆయన అద్భుతంగా జీవించాడు. ట్రాన్స్ లేటర్ గా సత్య కూడా అంతే స్థాయిలో జీవం పోశాడు. ఫస్టాఫ్ సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లో మాత్రం కాస్త భారంగా సాగినట్లు అన్పిస్తుంది. గాలి సంపత్ బావిలో పడిన తర్వాత బయటకు వచ్చే ప్రయత్నాలు చేసే సీన్...'బ్యాంక్ ఆడిట్ వ్యవహారం మరీ సాగదీసినట్లుగా ఉంటుంది.

ఎలాగైనా తన నటన నిరూపించుకోవాలనే ప్రయత్నంలో రంగస్థలంపై రాజేంద్రప్రసాద్ చేసే ఏకపాత్రాభినయం ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ క్రియేట్ చేయటం కోసం 99 రూపాయలు పొరపాటున గూగుల్ పే చేసినట్లు కనెక్ట్ చేయటం..ఈ సాకుతో అమ్మాయి కలవటం..వీరిద్దరి మధ్య వచ్చే డైలాగ్ లు కూడా అర్ధవంతంగా ఉంటాయి. కాకపోతే హీరోయిన్ లవ్లీ సింగ్ పాత్ర చాలా పరిమితమే అని చెప్పాలి. అనీశ్ కృష్ణ కథలో కొత్తదనం ఉంది. ఆయన దర్శకత్వంలోనే సినిమా తెరకెక్కింది. అయితే దీనికి స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ అనిల్ రావిపూడి చేశారు. ఈ మార్క్ సినిమాలో కన్పిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఫ్యామిలీ కలసి 'గాలి సంపత్' సినిమా ను హాయిగా చూడొచ్చు.

రేటింగ్. 3/5

Next Story
Share it