Telugu Gateway
Movie reviews

విజయ్, పరశురామ్ కాంబినేషన్ సక్సెస్ కొట్టిందా?(Family Star Movie Review)

విజయ్, పరశురామ్ కాంబినేషన్ సక్సెస్ కొట్టిందా?(Family Star Movie Review)
X

దర్శకుడు పరశురామ్, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద విజయం దక్కించుకుందో తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవటంతో ఫ్యామిలీ స్టార్ సినిమా పై కూడా అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి. ఈ సినిమాని తెరకెక్కించింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు కావటం తో అందరి దృష్టి ఫ్యామిలీ స్టార్ పై పడింది. విజయ్ గత సినిమా లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలితే...తర్వాత విడుదల అయినా ఖుషి సినిమా కూడా సో సో గానే నడిచింది అనే చెప్పాలి. దీంతో విజయ్ ఫ్యాన్స్ పరశురామ్, విజయ్ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అనే ధీమాతో ఉన్న వేళ భారీ అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది. టైటిల్ కు తగ్గట్లే హీరో విజయ్ ఫ్యామిలీ మ్యాన్. ఉమ్మడి కుటుంబం బాధ్యతలు అన్ని విజయ్ తన భుజాలపైనే మోస్తాడు. ప్రతి ఖర్చూ లెక్క వేసుకుని మరీ ముందుకు వెళుతుంటాడు. విజయ్ అన్న తాగుడుకు బానిస అయి కుటుంబాన్ని కూడా పట్టించుకోకపోవటంతో ఈ భారం కూడా విజయ్ పైనే పడుతుంది.

ఒక రోజు సడెన్ గా విజయ్ ఇంట్లో ఉండే పెంట్ హౌస్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అద్దెకు దిగుతుంది. అక్కడ నుంచే విజయ్ ఫ్యామిలీ తో ఆమె బంధం కూడా బలపడుతుంది. కానీ ఒక్క సారిగా విజయ్, మృణాల్ ఠాకూర్ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఎంతో బాగా కలిసిపోయిన వాళ్ళు ..అసలు మళ్ళీ జీవితం లో ఎప్పుడూ కలవరు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అన్నదే ఫ్యామిలీ స్టార్ సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వరకు రొటీన్ కథలాగా స్లో గా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ లో సినిమా ఇంకెన్ని మలుపులు ఉంటాయా అన్న ఆసక్తి పెరుగుతుంది. ఒక పుస్తకంతోనే ఈ సినిమా కథలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ పుస్తకం ఏమిటి..కథ అంతా దీని చుట్టూ ఎందుకు తిరిగింది అన్నదే ఫ్యామిలీ స్టార్ మూవీ.

ఒక అమ్మాయి ఒక అబ్బాయి కి ఐ లవ్ యు చెప్పింది అంటే అది ప్రేమించిన వాడికి మాత్రమే కాకుండా..ఆ ఫ్యామిలీ మొత్తానికి చెప్పినట్లు అంటూ విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ కి ఇచ్చే ప్రాధాన్యత చెప్పిస్తాడు డైరెక్టర్. మధ్య తరగతి కుటుంబ బాధ్యతలు మోసే పాత్రలో విజయ్ దేవరకొండ మంచి నటన కనపర్చారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమా అంతా కూడా ఎక్కువ భాగం హీరో, హీరోయిన్లకు తప్ప మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కథ, కథనాల్లో ప్రేక్షకులకు పెద్దగా కొత్తదనం కనిపించదు. కాకపోతే ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ గా పెట్టుకుని సినిమా ను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. పూర్తి ఫ్యామిలీ కథ కావటంతో మహిళా ప్రేక్షకులకు సినిమా నచ్చే అవకాశం ఉంది. ప్రొమోషన్స్ లోనూ చిత్ర యూనిట్ ఇదే విషయంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మీద చూస్తే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలం అయింది అనే చెప్పాలి.

రేటింగ్: 2 .75 /5

Next Story
Share it