Telugu Gateway
Movie reviews

డెవిల్ మూవీ రివ్యూ (Devil Movie Review)

డెవిల్ మూవీ రివ్యూ (Devil Movie Review)
X

ఫలితాలతో సంబంధము లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. బింబిసార విజయం తర్వాత ఈ హీరో అమిగోస్ సినిమా చేశాడు. అయితే అది బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాదించలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వెరైటీ స్టోరీ డెవిల్...బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్ తో విడుదల అయింది. 1945 నాటి కథ ఇది. ఒక మర్డర్ స్టోరీ కి..దేశ భక్తి కథను లింక్ చేసి నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. సుభాష్ చంద్రబోస్ ను పట్టుకునేందుకు అప్పటి బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నాలు..ఇండియా లో సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ ఎన్ఏ) సభ్యులు బ్రిటీషర్ల కు చిక్కకుండా ఎలా వ్యవహారాన్ని నడిపారు అన్న దాని చుట్టూనే సినిమా కథ అంతా తిరుగుతుంది. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ తో ప్రారంభం అయ్యే సినిమా రకరకాల ట్విస్ట్ లతో సాగుతుంది. ఇవి ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందవు అనే చెప్పాలి. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ కు అసలు మర్డర్ కేసు విచారణ బాధ్యతలు ఎందుకు అప్పగిస్తారు....ఈ కేసు విచారణ సమయంలో ఇండియా కు వస్తున్న సుభాష్ చంద్ర బోస్ ను పట్టుకునేందుకు బ్రిటిషర్లు చేసిన ప్రయత్నాలు ఏంటి?. దీనికి వాళ్ళు అనుసరించిన పద్ధతులు..వాళ్లకు ఏ మాత్రం సమాచారం అందకుండా సుభాష్ చంద్ర బోస్ టీం చేసుకున్న ఏర్పాట్లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.

వీటిని తెరపై ఎంతో పర్ఫెక్ట్ గా చూపించారు. టైటిల్ రోల్ డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సీరియస్ కథలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ సినిమా స్టోరీ లైన్ ఎక్కడా పక్కకు తప్పకుండా పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. అయితే పాటలు మాత్రం సినిమాకు కాస్త బ్రేకులు వేసినట్లు కనిపిస్తాయి. అసలు ఈ సినిమా కథకు పాటలు ఏ మాత్రం అవసరం లేదు అనే చెప్పొచ్చు. ఈ సినిమాలో మాళవిక నాయర్ ఉన్నది కొద్దిసేపు అయినా ఆమెది ఇందులో కీలక పాత్ర. డెవిల్ సినిమా స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉంది బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకున్నాడు. వివాదాల కారణంగా డెవిల్ సినిమా కు నిర్మాత అభిషేక్ నామా నే దర్శకుడిగా కూడా వ్యవహరించారు. అయినా సినిమా పై పెద్దగా ప్రభావం పడకుండా చేసుకోవటంలో విజయవంతం అయ్యారనే చెప్పాలి. డెవిల్ సినిమా కొంత మేర స్లో గా ఉన్నట్లు అనిపించినా మొత్తం మీద కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా మరో హిట్ ఇచ్చింది . 2023 సంవత్సరాన్ని ఈ హీరో హిట్ టాక్ తో ముగించారు అనే చెప్పాలి.

రేటింగ్ :3 /5

Next Story
Share it