Telugu Gateway
Movie reviews

ఎన్టీఆర్, కొరటాల మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా?!(Devara Movie Review)

ఎన్టీఆర్, కొరటాల మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా?!(Devara Movie Review)
X

ఎన్టీఆర్ సోలో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2018 లో. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీ. తిరిగి సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో 2022 లో మరో హీరో రామ్ చరణ్ తో కలిసి సంచలన విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీం పాత్ర కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. అంతే కాదు...ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బ్రాండ్ మరింత పెరిగిపోయింది అని కూడా చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మొదటి భాగం భారీ అంచనాల మధ్య శుక్రవారం నాడు విడుదల అయింది. గురువారం అర్ధరాతి నుంచే ప్రత్యేక షో లతో దేవర సందడి మొదలైంది. గతంలో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి హిట్ దక్కించుకోవటంతో ...దేవర తో కూడా అదే ఫలితం రిపీట్ అవుతుంది అని అందరూ భావించారు.

ఎన్టీఆర్ సోలో సినిమా కోసం ఆయన ఫాన్స్ , ప్రేక్షకులు ఇంత సుదీర్ఘకాలం వేచిఉన్న సమయంలో ఎలాంటి సినిమా రావాలి. కానీ దర్శకుడు కొరటాల శివ మరో సారి నిరాశపరిచాడు అనే చెప్పాలి. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ అదిరిపోయేలా ఉంటేనే...రెండవ భాగంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. కానీ ఈ జోష్ తీసుకురావటంలో దర్శకుడు సఫలం కాలేదు. ఎలాంటి పాత్రకు అయినా ఎన్టీఆర్ వంద శాతం న్యాయం చేయగల నటుడు. ఆయన యాక్షన్ మాత్రమే కాదు...డాన్స్..కామెడీ ఇలా ఒకటేమిటి అన్నిటిలోనూ సత్తాచాటగలడు. అది కథలో దమ్ము ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. దేవర ఫస్ట్ పార్ట్ లో వావ్ అనిపించే సన్నివేశాలు రెండు అంటే రెండే ఉన్నాయి. సముద్రంలో నుంచి ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఒకటి...తిమింగలం పై ఎన్టీఆర్ స్వారీ చేసే సీన్ ఒకటి అని చెప్పొచ్చు.

దేవర పాత్రలో ఎన్టీఆర్ సీరియస్ లుక్ లో...ఆయన కొడుకుగా వర లుక్ లో తన పాత్రలకు న్యాయం చేసిన కూడా సినిమా అంతా ఫ్లాట్ గా సాగుతుంది తప్ప...ఎక్కడా ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన జోష్ ఉండదు. సినిమా అంతా కూడా నాలుగు గ్రామాలు...సముద్రం చుట్టూనే తిరుగుతుంది. ఒకప్పుడు కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు (ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్) ఎందుకు విడిపోవాల్సి వచ్చింది...తర్వాత వీళ్లిద్దరి మధ్య సముద్రం సాక్షిగా సాగిన పోరాటమే దేవర సినిమా. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇందులో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారు కానీ..ఇందులో ఆయన నటన ఆకట్టుకునేలా ఏమీ లేదు. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కూడా చాలా పరిమితగానే ఉంది.

ఉన్నంత సేపు కూడా అది సినిమాపై అంత ప్రభావం చూపించేలా కూడా ఏమీ లేదు. సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, శ్రీకాంత్ వంటి కీలక నటులు ఉన్నా వీళ్ళవి రొటీన్ పాత్రలే తప్ప ..డెప్త్ ఉన్న పాత్రలు కావు . దేవర ఫస్ట్ పార్ట్ లో ఇప్పటికే విడుదల అయిన దావూది సాంగ్ ను సినిమాలో ఎత్తేశారు. సినిమా మొత్తం మీద అక్కడక్కడా డైలాగు లు ఒకే అనిపించినా ఇవి ఏ మాత్రం సరిపోవు అని చెప్పొచ్చు. మొత్తం మీద భారీ అంచనాల మధ్య విడుదల అయిన దేవర సినిమా వీటిని అందుకోవడంలో విఫలం అయింది అనే చెప్పాలి.

రేటింగ్ : 2 .75 /5

Next Story
Share it