Telugu Gateway
Movie reviews

ప్రియ దర్శి, నభానటేష్ డార్లింగ్ ఆకట్టుకుందా?!(Darling 2024 Movie Review)

ప్రియ దర్శి, నభానటేష్ డార్లింగ్ ఆకట్టుకుందా?!(Darling 2024 Movie Review)
X

ప్రియ దర్శి, నభానటేష్ కాంబినేషన్ లో డార్లింగ్..వై థిస్ కొలవెరి సినిమా ప్రకటనే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రకటనకు ముందు వీళ్లిద్దరు సోషల్ మీడియా వేదికగా చేసుకున్న ఫైట్ ఈ సినిమాపై అటెన్షన్ డ్రా చేయటానికి బాగానే ఉపయోగపడింది. ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచింది అనే చెప్పాలి. నభానటేష్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేసింది. శుక్రవారం నాడు డార్లింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రోగ్రెస్ కార్డు పై వాళ్ల నాన్న సంతకం పెడుతున్న ప్రియదర్శి ని చూసి తల్లి ఇదేంటిరా అంటే...ఈ లెక్కలు తన వల్ల కాదు...ఇక తాను చదవను అని చెపుతాడు. కానీ తల్లి మాత్రం మంచిగా చదువుకుని..మంచి ఉద్యోగం తెచ్చుకుంటే...మంచి భార్య వస్తుంది అని చెప్పటంతో చదువు పూర్తి చేస్తాడు. ఒక మంచి అమ్మాయిని చూసి...పెళ్లి చేసుకుని హనీమూన్ కు పారిస్ వెళ్ళటమే జీవిత లక్ష్యంగా పెట్టుకొంటాడు. స్కూల్ లో టీచర్ నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే కూడా ఇదే విషయం చెపుతాడు. చివరకు ఇంట్లో చూసిన అమ్మాయిని అంటే...సైకాలజిస్ట్ అనన్య నాగళ్లను పెళ్లి చేసుకోవటానికి సిద్ధం అవుతాడు ప్రియ దర్శి . కానీ ముహూర్తం సమయానికి అనన్య తాను ప్రేమించిన అబ్బాయి కోసం వెళ్ళిపోతుంది.

ఈ షాక్ లో ఆత్మ హత్య చేసుకోటానికి ఒక గుట్టపైకి వెళ్తాడు. అక్కడే ప్రియ దర్శికి నభానటేష్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు అన్ని ఇంట్లో వాళ్ళు చెప్పినవి చేయటం తప్ప...సొంతంగా..సొంత ఆలోచనతో ఒక్క పని చేసావా అంటూ క్లాస్ పీకుతోంది. పరిచయం అయిన కొద్ది గంటలకే ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నభానటేష్ ను పెళ్లి చేసుకుంటాడు. ఇక అక్కడ నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ నభానటేష్ కు ఉండే సమస్యతో హీరో పడే ఇబ్బందుల చుట్టూనే సినిమా తిరుగుతుంది. ఒక మనిషిలో ఏకంగా ఐదు విభిన్నమైన పర్సనాలిటీలు ఉన్న వ్యక్తులు ఉండటం ఎలా సాధ్యం అవుతుంది?. ఆ విభిన్న పర్సనాలిటీలు ఎలా ప్రవర్తిస్తాయి. మరి ఇన్ని మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్న క్యారక్టర్స్ తో నభానటేష్ ప్రియ దర్శికి ఎలా చుక్కలు చూపించింది అన్నదే డార్లింగ్ మూవీ . ఈ సినిమా లైన్ లో ఒక్క హీరోయిన్ లో మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ అనే పాయింట్ తప్ప మిగిలిన సినిమా స్టోరీ లైన్ అంతా ప్లాట్ గా సాగుతుంది. మరో వైపు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ విషయంలో వేరియషన్స్ కనిపించినా కూడా అవి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి అనే చెప్పాలి.

డార్లింగ్ సినిమా లో ప్రియ దర్శి తన పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే కథ అంత గ్రిప్పింగ్ గా...ఆసక్తికరంగా లేకపోవటంతో పెద్దగా ఫలితం లేకుండా పోయింది అనే చెప్పాలి. ఇక హీరోయిన్ నభానటేష్ విషయానికి వస్తే మంచి పాత్ర దక్కాలే కానీ నటనలో సత్తా చాటుతుంది. ఈ విషయం హీరో సుధీర్ బాబు తో కలిసి నభానటేష్ చేసిన నన్ను దోచుకుందువటే సినిమాలోనే తేలిపోయింది. డార్లింగ్ సినిమాలు కూడా నభానటేష్ తన క్యారెక్టర్ కు అనుగుణంగానే మంచి వేరియేషన్స్ చూపించినా కూడా పాత్రల గందరగోళం మధ్య ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి. ఈ బలహీనమైన స్టోరీ లైన్ లో కాస్తో కూస్తో ఊపు వచ్చింది అంటే కేవలం వివేక్ సాగర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే అనే చెప్పాలి. దర్శకుడు అశ్విన్ రామ్ సినిమాను ఆసక్తికరంగా మలచడంలో విఫలం అయ్యారు అనే చెప్పాలి. ఈ సినిమాలో సుహాస్, కొణిదల నిహారిక లు ప్రత్యేక పాత్రల్లో మెరుస్తారు. ఫైనల్ గా ఈ డార్లింగ్ అంత ప్రియమైనది ఏమి కాదు.


రేటింగ్ : 2 .25 /5

Next Story
Share it