'చావు కబురు చల్లగా' మూవీ రివ్యూ
పుట్టుకది ఓ దారి. చావుది మరో దారి. ఈ రెండూ ఎప్పుడూ కలవవు. ఈ మూవీ స్టోరీ లైన్ ఇదే. ఈ సినిమాలో హీరోయిన్ మల్లిక (లావణ్య త్రిపాఠి) మెటర్నిటి వార్డులో నర్సుగా పనిచేస్తుంది. హీరో బస్తీ బాలరాజు (కార్తికేయ) అంతిమ యాత్రల వాహనం నడుపుతూ ఉంటాడు. మల్లిక భర్త పీటర్ అకస్మాత్తుగా చనిపోవటంతో అంతిమయాత్ర కోసం బాలరాజుకు ఫోన్ వస్తుంది. చనిపోయిన వ్యక్తిని స్మశానానికి తీసుకెళతారు. అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక..బాలరాజు సడన్ గా మల్లికకు ప్రపోజ్ చేస్తాడు. ఇది విన్న వారంతా షాక్ కు గురవుతారు. బహుశా స్మశానంలో లవ్ ప్రపోజ్ చేసిన ఘటన ప్రపంచ సినిమా చరిత్రలో బహుశా ఇదే మొదటిది కూడా అయి ఉండొచ్చు. అది కూడా భర్త చనిపోయిన ఆమెతో. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఎన్నిసార్లు తిరస్కరించినా బాలరాజు అలా మల్లిక ఇంటికి వెళుతూ తన ప్రపొజల్ గురించి ప్రస్తావిస్తూనే ఉంటాడు.
మరి చివరకు మల్లిక బాలరాజుకు ఓకే చెప్పిందా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే. సినిమా ఫస్టాఫ్ బాగానే నడిచిపోతుంది కానీ..సెకండాఫ్ మాత్రం కాస్త భారంగా నడిచిన ఫీలింగ్ కలుగుతుంది. బస్తీ బాలరాజుగా కార్తికేయ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన లావణ్య త్రిపాఠి ఈ పాత్రకు ఒప్పుకుని సాహసమే చేసిందని చెప్పాలి. లావణ్య మామగా నటించిన మురళీ శర్మ పాత్ర కూడా హైలెట్ గా నిలుస్తుంది.
చావు, పెళ్లిళ్ళ గురించి పలు సందర్భాల్లో వచ్చే సంభాషణలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. డైలాగులు అన్నీ పాత్రలకు అనుగుణంగా సెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాటలు కూడా సందర్భానుసారం రావటంతో పాటు కథకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దర్శకుడు పెగళ్లపాటి కౌషిక్ పస్టాఫ్ విషయంలో సక్సెస్ అయినా..సెకండాఫ్ లో మాత్రం ఆ ఆ జోరు చూపించలేకపోయారు. ఈ సినిమాకు హైప్ తీసుకురావటంలో చిత్ర యూనిట్ బాగానే ప్రచారం నిర్వహించింది. అయితే స్టోరీ లైన్ కొత్తగా ఉన్నా..ప్రేక్షకులకు ఎంత మేర కనెక్ట్ అవుతుందో వేచిచూడాల్సిందే
రేటింగ్.2.5/5