Telugu Gateway
Movie reviews

బ్రో ఏమంటున్నాడు!

బ్రో ఏమంటున్నాడు!
X

కథను కేవలం కథలాగా చెప్పటం తమిళ్ స్టైల్. అదే కథకు కాస్త మసాలా అద్ది ప్రేక్షుకులను మరింత ఆకట్టుకునేలా చూపించటం టాలీవుడ్ స్టైల్. హీరో ను బట్టి కథలో అవసరమైన మార్పులు కూడా చేస్తారు. అయినా మూలకథ నుంచి ఏ మాత్రం పక్కకు పోకుండా తెరకెక్కించిన సినిమానే బ్రో మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలి సారి కలిసి నటించటం ఒకటి...తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం కు ఈ బ్రో మూవీ రీమేక్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే తాను లేకపోతే తమ కంపెనీ కి చాలా కష్టం అని భావించే ఉద్యోగులు...తమ కుటుంబానికి తాను మాత్రమే దిక్కు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు ఉన్నా లేక పోయిన కంపెనీలు అలా ముందుకు సాగుతాయి....కుటుంబాలు కూడా అంతే అని చెప్పే సినిమానే బ్రో. నిత్యం తనకు ఏ మాత్రం టైం టైం లేదు అంటూ హడావుడిగా తిరుగుతుంటాడు సాయి ధరమ్ తేజ్. చివరకు లవర్ కు టైం ఇవ్వటానికి కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లటానికి పట్టే ఆ సమయం అంటే 45 నిముషాలు కారు లో మాట్లాడుకుందాం రమ్మంటాడు. తాను పని చేసే కంపెనీలో ఎంతో సిన్సియర్ గా జాబ్ చేస్తూ జనరల్ మేనేజర్ పోస్ట్ దక్కించుకోవాలని చూస్తాడు. కానీ రేపు పుట్టినరోజు ఉంది అనగా కారు లో హైదరాబాద్ వస్తూ రోడ్ ప్రమాదంలో చనిపోతాడు.

చనిపోయి పైకి పోయిన తర్వాత అక్కడ కాలం (పవన్ కళ్యాణ్ ) తో ఘర్షణ పడి అతి చిన్న వయసులోనే తనను చంపటం అన్యాయం అని వాదిస్తాడు. దీంతో కాలం పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కు 90 రోజులు తిరిగి గడువు ఇస్తాడు. ఈ తొంబై రోజుల గడువులో తన కుటుంబ బాధ్యతలు అన్ని పూర్తి చేశాడా...అసలు ఏమి జరిగింది అన్నదే బ్రో సినిమా. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన విషయానికి వస్తే కాలం పాత్రలో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అటు ఉద్యోగంలో పదోన్నతి...కుటుంబ బాధ్యతలు మోసే పాత్రలో సాయి ధరమ్ తేజ్ కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సూపర్ గా సెట్ అయింది అని చెప్పాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిటిక వేస్తే వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ ను ఫుల్ గా ఆకట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా తరహాలోనే ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ లో పొలిటికల్ డైలాగు లు చెప్పించి ఫాన్స్ ను కుష్ చేశారనే చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ కు జోడిగా ఈ సినిమా లో కేతిక శర్మ నటించింది. వీళ్ళ లవ్ ట్రాక్ కు పెద్దగా స్కోప్ లేదు...ఆమె పాత్ర కూడా చాలా పరిమితంగానే ఉంది. మరో హీరోయిన్ ప్రియా వారియర్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు చెల్లిగా నటించింది. మొత్తానికి ఈ సినిమా ద్వారా చెప్పాల్సిన సందేశాన్ని పర్ఫెక్ట్ గా చెప్పటంతో పాటు...భావోద్వేగాలు కూడా బాగానే పండాయనే చెప్పాలి. ఈ సినిమాకు థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు బ్రో మూవీ తో జట్టు కట్టి హిట్ కొట్టారు.

రేటింగ్ :3 .25 / 5

Next Story
Share it