‘బిచ్చగాడు 2’ మూవీ రివ్యూ
ఒక కమర్షియల్ సినిమా కు బిచ్చగాడు అనే టైటిల్ పెట్టాలి అంటే దానికి ఎంతో దమ్ము...దైర్యం ఉండాలి. ఏ టైటిల్ తో వచ్చినా సరే కథలో సత్తా ఉంటే చాలు అని నిరూపిస్తూ బిచ్చగాడు. సినిమా తెలుగులో కూడా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 తో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కథ తో పాటు దర్సకత్వం వహించింది కూడా హీరో విజయ్ ఆంటోనీ కావటం ఇక్కడ మరో విశేషం. బిచ్చగాడు సినిమా సూపర్ సక్సెస్ కావటంతో రెండవ భాగంపై కూడా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పొచ్చు. ప్రపంచానికి డబ్బు హాని కరం అంటూ సినిమా ను స్టార్ట్ చేసి కథ అంతా దేని చుట్టూ తిరుగుతుందో చెప్పకనే చెప్పారు. ఇక ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ రెండు పాత్రలు పోషించారు. అందుకో ఒకటి భిక్షగాడు అయితే...రెండవది దిగ్గజ పారిశ్రామిక వేత్త. ఈ పారిశ్రామిక వేత్త పక్కన ఉండే వాళ్ళు అయన ఆస్తిని కొట్టేయటానికి ప్లాన్ వేస్తారు. ఇందుకు ఒక డాక్టర్ సాయంతో పారిశ్రామికవేత్త బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుతారు. ఒక బిచ్చగాడిని దీనికి ఎంచుకుంటారు. బిచ్చగాడి మెదడు తీసి పారిశ్రామికవేత్త కు మార్పిడి పూర్తి చేసి ఇక అంతా తాము చెప్పినట్లు చేయించుకోవాలని ఈ గ్రూప్ ప్రయత్నాలు చేస్తుంది.
మరి పారిశ్రామికవేత్త ఆస్తిని ఆ గ్రూప్ దక్కించుకుందా?...మరి బిచ్చగాడు ఒక పారిశ్రామివేత్త పాత్రలోకి మారిపోయిన తర్వాత ఏమి చేశాడు అన్నదే ఈ సినిమా. బిచ్చగాడు సినిమా అంతా తల్లి సెంటిమెంట్ చుట్టూ తిరిగితే...రెండవ భాగంలో మాత్రం సెంటిమెంట్ అంతా చెల్లి చుట్టూ తిరుగుతుంది. దేశంలో పేదరికం ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి అనే అంశాన్ని ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనటంలో సందేహం లేదు. లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఏమి చేస్తే ప్రజలకు నిత్యావసర వస్తువులు, వైద్యం అందుతాయి అని డిస్కస్ చేసిన పాయింట్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా చాలా వేగంగా ముందుకు సాగుతుంది. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తానటంలో సందేహం లేదు. బిచ్చగాడు 2 సినిమా నిర్మాణ విలువల విషయంలో విజయ్ ఆంటోనీ ఏ మాత్రం రాజీపడలేదు అనే విషయం సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. హీరోయిన్ కావ్య థాపర్ ది పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర కాదు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ యాక్షన్, బావోద్యోగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మొత్తానికి బిచ్చగాడు 2 తో కూడా విజయ్ ఆంటోనీ మరో సారి హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు.
రేటింగ్: 3 -5