Telugu Gateway
Movie reviews

'భీమ్లానాయ‌క్' మూవీ రివ్యూ

భీమ్లానాయ‌క్ మూవీ రివ్యూ
X

అహంకారానికి..అత్మ‌గౌర‌వానికి మ‌ధ్య మ‌డ‌మ‌తిప్ప‌ని యుద్ధం. ఇదే భీమ్లానాయ‌క్ సినిమా అంటూ ప్రచారం చేసింది చిత్ర యూనిట్. మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియం సినిమా రీమేక్ గా దీన్ని తెర‌కెక్కించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానాలు తొలిసారి ఈ సినిమాతో మ‌ల్టీస్టార‌ర్ మూవీతో ముందుకొచ్చారు. ప‌వ‌న్ కు జోడీగా నిత్యామీన‌న్, ద‌గ్గుబాటి రానాకు జోడీగా సంయుక్తామీన‌న్ లు న‌టించారు. సినిమా అస‌లు క‌థ విషయానికి వ‌స్తే భీమ్లానాయ‌క్ (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) అట‌వీ ప్రాంతంలో ఎస్ ఐగా ప‌నిచేస్తారు. అదే అట‌వీ ప్రాంతం నుంచి డేనియ‌ల్ శేఖ‌ర్ (దగ్గుబాటి రానా) మ‌ద్యం భాటిళ్ళ‌లో ప్ర‌యాణిస్తూ చెక్ పోస్టు ద‌గ్గ‌ర పోలీసులకు దొరుకుతాడు. పోలీసుల త‌నిఖీల్లో ప‌రిమితికి మించి మ‌ద్యం బాటిళ్ళు ఉండ‌టంతో అరెస్ట్ చేస్తారు. ఆ క్ర‌మంలోనే డేనియ‌ల్ శేఖ‌ర్ పోలీసుల‌తోపాటు అట‌వీ శాఖ సిబ్బందిపై కూడా దాడి చేస్తాడు. ఈ స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చిన భీమ్లానాయ‌క్ అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తాడు. సినిమా క‌థ అంతా కూడా కారులో మ‌ద్యం సీసాలు..అరెస్ట్ చుట్టూనే తిరుగుతుంది. అరెస్ట్ అయిన డేనియల్ శేఖ‌ర్ పెగ్గుప‌డ‌క‌పోతే చ‌చ్చిపోతాను అనేంత బిల్డ‌ప్ ఇచ్చి స్టేష‌న్ లోనే సీల్ చేసిన బాటిల్ నుంచి మ‌ద్యం గ్లాస్ లో పోయించుకుని తాగుతాడు.

సీల్ చేసిన బాటిల్ నుంచి బీమ్లానాయ‌క్ మ‌ద్యం గ్లాస్ లో పోసే స‌న్నివేశంతోపాటు ..మందులో క‌లుపుకోవ‌టానికి మ‌హిళా కానిస్టేబుల్ మంచి నీళ్లు తెచ్చే స‌న్నివేశాన్ని డేనియ‌ల్ శేఖ‌ర్ వీడియో తీస్తాడు. లాయ‌ర్ తో మాట్లాడుకోవ‌టానికి ఇచ్చిన ఫోన్ తో ఇది అంతా చేస్తాడు. క‌స్ట‌డీ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక డేనియ‌ల్ శేఖ‌ర్ భీమ్లానాయ‌క్ మ‌ద్యం పోసిన వీడియోతో ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయ‌టంతో నాయ‌క్ ఉద్యోగం పోతుంది. అప్ప‌టి నుంచి భీమ్లానాయ‌క్ పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని డానియ‌ల్ శేఖ‌ర్, డేనియ‌ల్ శేఖ‌ర్ కు బుద్ధి చెప్పాల‌ని చేసే ప్ర‌య‌త్నాలే భీమ్లానాయ‌క్ సినిమా. భీమ్లానాయ‌క్ గా ప‌వ‌న్ కళ్యాణ్‌, డేనియ‌ల్ శేఖర్ గా రానా ద‌గ్గుబాటి ఇద్ద‌రూ దుమ్మురేపారు. కారులో అక్ర‌మ మ‌ద్యం అనే పాయింట్ ను తీసుకుని సినిమాను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర విజ‌యం సాధించార‌నే చెప్పాలి. భీమ్లానాయ‌క్ అట‌వీ ప్రాంతంలో ఓ ఫారెస్ట్ కాంట్రాక్ట‌ర్ నుంచి ఆ ప్రాంత ప్రజ‌ల‌ను ఎలా కాపాడాడు అనేది క్లైమాక్స్ లో చూపించినా అది ఎంత ఆసక్తిక‌రంగా ఉండ‌దు.

డేనియ‌ల్ శేఖర్ ను కాపాడేందుకు ఆయ‌న భార్య చేసే ప్ర‌య‌త్నం.. భీమ్లానాయ‌క్ తో ఆమెకు గ‌తంలో ఉన్న అనుబంధం గురించి చెప్ప‌టానికి..క‌నెక్టివిటికి అది ఉప‌యోగ‌ప‌డింది. ఫ‌స్టాఫ్ అంతా సాఫీగా..త‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అదిరిపోతుంది. అయితే ఫ‌స్టాఫ్ లో క‌న్పించిన స్పీడ్ సెకండాఫ్ లో కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. భీమ్లానాయ‌క్ పాట‌లు ఇప్ప‌టికే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. సినిమాలోనూ పాట‌ల పిక్చ‌రైజేష‌న్ ఆక‌ట్టుకునేలా ఉంది. డేనియ‌ల్ శేఖ‌ర్ ను అరెస్ట్ చేసిన స‌మ‌యంలో ఆయ‌న ఫోన్ కాంటాక్ట్ లిస్టులో తెలంగాణ మంత్రి కెటీఆర్ ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్, కెసీఆర్ నెంబ‌ర్ ఉన్న‌ట్లు పోలీసులు ఇచ్చే బిల్డ‌ప్..ఆ స‌మ‌యంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ఆ ఎలివేష‌న్ చూస్తే ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారుతో టిక్కెట్ల విష‌యంలో ఏర్ప‌డిన గొడవ కార‌ణంగా ఇక్క‌డ వారిని పైకి లేపిన‌ట్లు క‌న్పిస్తుంది. ఈ సినిమాలో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మెరుపులు అక్క‌డక్క‌డ క‌న్పిస్తాయి. ఓవ‌రాల్ గా చూస్తే భీమ్లానాయ‌క్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి హిట్ కొట్టాడ‌నే చెప్పొచ్చు. ప‌వ‌న్ ఫ్యాన్స్ కు అయితే పండ‌గే పండ‌గ‌. ఫ్యాన్స్ కాక‌పోయినా భీమ్లానాయ‌క్ ను ఎంజాయ్ చేయోచ్చు.

రేటింగ్. 3.25-5

Next Story
Share it