Telugu Gateway
Movie reviews

కమల్ హాసన్, శంకర్ మేజిక్ రిపీట్ అయిందా?!(Bharateeyudu 2 Movie Review)

కమల్ హాసన్, శంకర్ మేజిక్ రిపీట్ అయిందా?!(Bharateeyudu 2 Movie Review)
X

సరిగ్గా 28 సంవత్సరాల క్రితం అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన సంచలన సినిమా భారతీయుడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డు లు నమోదు చేసింది. అదే కాంబినేషన్ తో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా భారతీయుడు 2 జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తో పాటు వివిధ కారణాలతో ఈ సినిమా నిర్మాణంలో విపరీత జాప్యం జరిగింది. అన్ని అడ్డంకులను అధిగమించి ఈ సినిమా విడుదలకు సిద్ధం అయినా కూడా ఇతర కమర్షియల్ సినిమాలతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే భారతీయుడు 2 కి అంత బజ్ రాలేదు అనే చెప్పాలి. ఈ సినిమా కథ అందరికి తెలిసిందే. భారతీయుడు 2 సినిమా కూడా అవినీతికి వ్యతిరేకంగా తెరకెక్కిందే. సమాజంలో కొంత మంది సోషల్ మీడియా వేదికగా ఎలాగైతే ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నారో అలాగే ఈ సినిమా లో కూడా సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, మరి కొంత మంది ఫ్రెండ్స్ కలిసి బార్కింగ్ డాగ్స్ పేరుతో ప్రభుత్వంలో చోటు చేసుకునే అవినీతి, ఇతర సామాజిక సమస్యలను తమ ఛానెల్ వీడియోల్లో చూపిస్తూ ఉంటారు.

దేశంలో అవినీతి ని నిరోధించటానికి తమ వంతు ప్రయత్నం చాలదు అని..దీనికి తిరిగి భారతీయుడు వంటి వాడు తిరిగి రావాల్సిందే అంటూ సోషల్ మీడియా లో కం బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తారు. దీంతో ఇది దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వైరల్ అవుతుంది. ఇది చూసిన భారతీయుడు తిరిగి ఇండియాకు వచ్చాడా...వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆయన్ను మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అన్నదే భారతీయుడు 2 సినిమా. ఇందులో హై లైట్ ఏదైనా ఉంది అంటే అది కమల్ హాసన్ యాక్షన్ అనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించాడు. సిద్దార్థ్ కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో విదేశాల్లో తలదాచుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఒక పారిశ్రామిక వేత్తను చూపించారు. ఇది విజయమాల్యా పాత్రను పోలి ఉండటం విశేషం. భారతీయుడు 2 సినిమాలో దర్శకుడు శంకర్ ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం ఎంతో కష్టమో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ప్రతి ఇల్లు స్వచ్ఛంగా ఉంటే...దేశం కూడా స్వచ్ఛంగా మారుతుంది అనే భారతీయుడు 2 మాటలకు స్పందించిన యువతకు తర్వాత ఎదురయ్యే సవాళ్లతోనే ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ లో సిద్దార్థ్ అండ్ టీం తో సినిమా కథలోకి తీసుకొచ్చి కొద్ది సేపటి తర్వాత భారతీయుడిగా కమల్ హాసన్ ఎంట్రీని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. భారతీయుడు ఫస్ట్ పార్ట్ చూసి...అంతకి మించిన అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు మాత్రం నిరాశే మిగులుతుంది అని చెప్పొచ్చు. భారతీయుడు మొదటి భాగంలో సేనాపతితో పాటు యువ కమల్ హాసన్ ...లవ్ ట్రాక్ ఉండటం..పాటలు ఆ సినిమాకు ఎంతగానో కలిసి వచ్చాయి. కానీ భారతీయుడు 2 లో ఇలాంటి అంశాలు ఎన్నో మిస్ అయ్యాయి. తొలి సినిమా తరహాలోనే రెండవ భాగంలోనూ దర్శకుడు శంకర్ వర్మ కళ అనే కొత్త విద్యతో కమల్ హాసన్ అవినీతిపరులను ఎలా అంతమొందించేది చూపించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పాత్రా పరిమితం అనే చెప్పాలి. ఇండియన్ ను పట్టుకునే సిబిఐ ఆఫీసర్ గా బాబీ సింహ రోల్ లో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. ఎస్ జె సూర్య, సముద్ర ఖని ఇతర కీలక పాత్రల్లో కనిపించరు. కమల్ హాసన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసిన శంకర్ మాత్రం సినిమాలో జోష్ తీసుకురావటంలో విఫలం అయ్యారు.

రేటింగ్ : 3 / 5

Next Story
Share it