Telugu Gateway
Movie reviews

బీస్ట్ మూవీ రివ్యూ

బీస్ట్ మూవీ రివ్యూ
X

ఈ వారంలో డైర‌క్ట్ తెలుగు సినిమాలు ఏమీ లేవు. అయినా ప్రేక్షకుల‌ ఎంట‌ర్ టైన్ మెంట్ కు కొద‌వ‌లేద‌నే చెప్పాలి. ఎందుకంటే త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ న‌టించిన సినిమా బీస్ట్ బుధ‌వారం నాడు విడుద‌లైంది. గురువారం నాడు కెజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన య‌శ్ సినిమా కెజీఎఫ్ 2 రానుంది. బీస్ట్ సినిమాలోని 'అరబిక్ కుతు పాట సినిమాపై అంచ‌నాల‌ను పెంచింద‌నే చెప్పాలి. ఇక సినిమా క‌ధ విష‌యానికి వ‌స్తే తెలుగులో గోపీచంద్ న‌టించిన చాణ‌క్య సినిమాకు ఇది చాలా ద‌గ్గ‌రగా ఉంటుంది క‌థ‌. విజ‌య్ ఈ సినిమాలో రా అధికారిగా క‌న్పిస్తాడు. కీల‌క టెర్ర‌రిస్ట్ ను అంత‌మొందించే స‌మ‌యంలో అధికారులు విజ‌య్ ను త‌ప్పుదారి పట్టించి హీరోకు ఇష్ట‌మైన ఓ బాలిక మ‌ర‌ణానికి కార‌ణం అవుతారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి విజ‌య్ విధుల‌కు దూరంగా ఉంటాడు. ఆ స‌మ‌యంలో తీవ్రవాదులు చెన్న‌య్ లోని ఈస్ట్ కోస్ట్ మాల్‌ను, మాల్ లో ఉన్న ప్ర‌జ‌ల‌ను బంధీలుగా చేసుకుని పాకిస్తాన్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ తీవ్ర‌వాదిని విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తారు. ఉగ్ర‌వాదుల బందీల్లో కేంద్ర హోం మంత్రి భార్య, కుమార్తె సహా విజ‌య్, త‌న ప్రియురాలు పూజాహెగ్డెతో క‌ల‌సి ఉంటాడు. కేంద్ర హోం మంత్రి ఈ టెర్రరిస్ట్ ఆప‌రేష‌న్ ద్వారా తాను ప్ర‌ధాని కావాల‌ని ప్లాన్ చేస్తాడు. కేంద్ర మంత్రి, ఉగ్ర‌వాదుల‌తో క‌ల‌సి చేసిన ప్లాన్ ను హీరో విజ‌య్ ఎలా భగ్నం చేస్తాడు. విధులకు దూరంగా ఉన్నా..మాల్ లో ఉన్న విజ‌య్ తో ఎలా ఆప‌రేష‌న్ చేప‌డ‌తారు అన్న‌దే సినిమా.

విజ‌య్ త‌న సెటిల్డ్ యాక్షన్ తో ఆక‌ట్టుకుంటాడు. ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలో కామెడీని జొప్పించి సినిమా ఎక్క‌డా కూడా బోర్ కొట్ట‌కుండా న‌డిపించాడు అనే చెప్పాలి. క‌థ పాత‌తే..ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో చూసిందే అయినా న‌డిపించిన విధానం మాత్రం ఆక‌ట్టుకుంటుంది. అయితే హీరోయిన్ పూజా హెగ్డె పాత్ర చాలా పరిమితం అనే చెప్పాలి. అయితే ఇప్ప‌టికే సూప‌ర్ పాపుల‌ర్ అయిన 'అరబిక్ కుతు' సాంగ్ సినిమాలో చాలా రిచ్ గా ఆక‌ట్టుకుంటుంది. ఈ పాటను చిత్రీకరించిన విధానం బావుంది. అనిరుద్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. విజ‌య్ ఇమేజ్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని యాక్షన్ సీన్స్‌ను చాలా స్టయిలిష్‌గా డిజైన్ చేశారు. ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడలేదని ప్రతి ఫ్రేమ్‌లోనూ కనపడింది. బీస్ట్ మూవీలో విజయ్ తన పాత్రకు న్యాయం చేశారు. మేనరిజమ్స్, యాటిట్యూడ్ చక్కగా చూపించారు. స్టైలిష్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఎక్కువ. క్లైమాక్స్ లో పాకిస్తాన్ వెళ్లి భార‌త ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మోస్ట్ వాంటెడ్ తీవ్ర‌వాదిని యుద్ధ విమానంలో తీసుకురావ‌టం..ఆ స‌మ‌యంలో పాక్ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు..అందుకు విజ‌య్ భార‌త ప్ర‌భుత్వ సాయంతో చేసే విమాన విన్యాసాలు ఆక‌ట్టుకుంటాయి. లాజిక్కులు వెత‌క్కుండా చూస్తే బీస్ట్ ఎక్క‌డా బోర్ కొట్ట‌ని టైమ్ పాస్ మూవీ.

రేటింగ్ 2 .75-5

Next Story
Share it