Telugu Gateway
Movie reviews

గుండెలు పిండేసే ప్రేమ కథ

గుండెలు పిండేసే ప్రేమ కథ
X

ప్రేమకు మరణం ఎలా ఉండదో ...సినిమాల ప్రేమ కథలు కూడా అంతే. కొత్తగా చెప్పాలే కానీ...ప్రేమ కథలు ఎంత మంది దర్శకులు...ఎన్ని సార్లు తీసినా కంటెంట్ కొత్తగా ఉంటే వాటికి ఢోకా ఉండదు. శుక్రవారం నాడు విడుదల అయినా బేబీ సినిమా కూడా ఇదే నిరూపించింది అని చెప్పాలి. టీజర్, ట్రైలర్ లు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య చెప్పే డైలాగు ‘తిరిగి కొట్టేంత బలం లేదు అనేగరా నీకు ఇంత కోపం. నీ అంత బలం లేకుండొచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవరు కొట్టలేరు.’ అనే డైలాగు ఈ సినిమాలోని డెప్త్ ను చెప్పిందే అనే అర్ధం చేసుకోవాలి. మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అనే కాన్సెప్ట్ తో నే ఈ సినిమాను తెరకెక్కించారు. స్కూల్ ప్రేమలతో టాలీవుడ్ లో ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. అయినా కూడా దర్శకుడు సాయి రాజేష్ ప్రస్తుత యువత ను దృష్టిలో పెట్టుకొని ఈ కథను తెరమీదకు తీసుకువచ్చారు . ఈ సినిమా కు కథ అందించింది కూడా ఆయనే. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఆనంద్, వైష్ణవి లు స్కూల్ లో ఉన్నపటి నుంచి ప్రేమలో ఉంటారు. ముందు వైష్ణవినే ఆనంద్ ను ప్రేమిస్తుంది. ఆనంద్ టెన్త్ ఫెయిల్ అయి ఆటో నడుపుకుంటూ ఉంటాడు. కానీ వైష్ణవి మాత్రం ఇంటర్ కూడా పూర్తి చేసి డిగ్రీ లో చేరుతుంది. అప్పటి నుంచే ఇద్దరి ప్రేమ మధ్య గ్యాప్ వస్తుంది. వైష్ణవి కి చిన్నప్పటి నుంచి గిఫ్ట్ లు...కార్లు అంటే ఇష్టం. ఆనంద్ తన స్థాయిలో వైష్ణవి కి గిఫ్ట్ లు ఇస్తూనే ఉంటాడు. కానీ కాలేజీ కి వెళ్ళాక...బస్తీ అమ్మాయి అయిన వైష్ణవి కూడా ఇతర సంపన్నుల పిల్లల మాదిరి షాపింగ్ మాల్స్, పబ్ లకు వెళ్ళటం అలవాటు చేసుకుంటుంది.

వైష్ణవి పేదరికాన్ని ఆసరా చేసుకుని సంపన్నుడు, క్లాస్ మెట్ అయిన విరాజ్ పెద్ద గిఫ్ట్ లు ఇస్తూ...పబ్ లకు తీసుకెళుతూ స్నేహం చేస్తాడు. ఒక సారి పబ్ లో చేసిన తప్పుతో వైష్ణవి చిక్కుల్లో పడుతుంది. ఇక అప్పటినుంచి ఈ విషవలయం నుంచి బయట పడేందుకు తప్పులు చేస్తూనే పోతుంది. మరి ఈ ముక్కోణ ప్రేమ కథ కు ఎలాంటి ముగింపు వచ్చింది అన్నదే బేబీ సినిమా. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో హీరో ఆనంద్ దేవరకొండ నటన మెరుగుపడింది అనే చెప్పాలి. భావోద్వేగాలు పండించటంలో కూడా ఆనంద్ తన సత్తా చాటాడు. అయితే హీరోయిన్ వైష్ణవి ఈ సినిమాలో తన పాత్ర ద్వారా అందరిని డామినేట్ చేసింది . తొలి సినిమాలోనే వైష్ణవి తన నటన తో దుమ్ము రేపింది అనే చెప్పాలి. నటన తో పాటు వైష్ణవి డైలాగులు చెప్పిన విధానం కూడా ఆకట్టుకుంది. విరాజ్ కూడా కాలేజీ స్టూడెంట్ గా..వైష్ణవిని ప్రేమించమని వెంట పడే యువకుడు పాత్రలో మెప్పించాడు. బేబీ సినిమాలో ప్రధానంగా భావోద్వేగ సన్నివేశాలు బాగా వర్క్ అవుట్ అయ్యాయి . ఈ సినిమాలో బూతు డైలాగులు ప్రేక్షుకులను కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. కేవలం యూత్ ని టార్గెట్ చేసుకుని సినిమా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఎమోషన్స్ తో పాటు సినిమా లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ గా ఉంది . ఓవరాల్ గా చూస్తే బేబీ సినిమా తో ఆనంద్ దేవరకొండ కు హిట్ దక్కినట్లే. వైష్ణవికి ఈ సినిమా తర్వాత కూడా కచ్చితంగా మంచి ఛాన్స్ లు దక్కించుకోవటం ఖాయం అని చెప్పొచ్చు. ఫైనల్ గా బేబీ సినిమా యువతీ, యువకుల గుండెలు పిండేసే సినిమా.

రేటింగ్: 3 -5

Next Story
Share it