Telugu Gateway
Movie reviews

వంగా సందీప్ రెడ్డి మళ్ళీ హిట్ కొట్టారా?

వంగా సందీప్ రెడ్డి మళ్ళీ హిట్ కొట్టారా?
X

ఒక్క సినిమా అర్జున్ రెడ్డి తో సంచలన దర్శకుడిగా మారిపోయారు వంగా సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి తర్వాత అయన దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. బాలీవుడ్ టార్గెట్ గా సినిమా తెరకెక్కించినా తెలుగు తో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల అయింది. దర్శకుడు తెలుగు వాడు కావటం...సినిమాలో హీరోయిన్ రష్మిక ఉండటంతో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై హైప్ ఏర్పడింది. హైదరాబాద్ లో ఉదయం ఆరు గంటల నుంచే షోస్ వేసారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వంగా సందీప్ రెడ్డి సినిమాలు అంటే ఏ సర్టిఫికెట్ పక్కా అన్నట్లు మారిపోయింది. ఎందుకంటే యానిమల్ కు కూడా అదే పరిస్థితి. దర్శకుడు సందీప్ రెడ్డి ఒక సింపుల్ లైన్ తీసుకుని పర్ఫెక్ట్ గా కథ నడిపించారు అని చెప్పాలి. గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లోనే బిజినెస్ పనుల్లో బిజీ గా ఉండే తల్లితండ్రులు పిల్లలను ఎలా నిర్లక్ష్యం చేస్తారు అనే కోణంలో వందల సినిమాలు వచ్చి ఉంటాయి. ఈ సినిమా లైన్ కూడా అదే. అయితే ఇక్కడ హీరో కు తండ్రి అంటే పిచ్చి అభిమానం. తండ్రి అంటే పిచ్చి అభిమానం ఉండే కొడుకుగా రణబీర్ కపూర్..తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. తన తండ్రి పుట్టిన రోజుకు ఒక్కసారి అయినా ఆయన్ను కలిసి విషెస్ చెప్పి కుటుంబంతో గడపాలనే హీరో కోరిక నెరవేరదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటూనే ఉంటాడు. పైగా తన అక్కకు ఒక సారి కాలేజీ లో ఎదురైన సమస్యను కూడా తానే పరిష్కరించి తండ్రితో చీవాట్లు తింటాడు. ఇక్కడ ఉంటే మరింత గాడి తప్పుతాడు అని అమెరికా కు పంపిస్తారు.

వీళ్ళ ఫ్యామిలీకి చెందిన స్వస్తిక్ స్టీల్ ప్లాంట్ సామ్రాజాన్ని రణబీర్ కపూర్ బావ చూసుకుంటూ ఉంటాడు. ఒక సారి స్వస్తిక్ స్టీల్ అధినేత అనిల్ కపూర్ ను చంపటానికి శత్రువులు ప్రయత్నాలు చేస్తారు. బుల్లెట్ గాయాలతో అనిల్ కపూర్ బయటపడతాడు. అసలు ఎవరు స్వస్తిక్ స్టీల్ అధినేత హత్యకు ప్లాన్ చేశారు...వాళ్ళను హీరో ఎలా తుదముట్టించాడు అన్నదే సినిమా. యానిమల్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్ లో ఉంది అని చెప్పొచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్లు దద్దరిల్లి పోతాయి. సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఒక కోతి కథతో స్టార్ట్ చేసి ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేశాడు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ చూపించిన పాత్రల వేరియేషన్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. ఒక ఎంగేజ్ మెంట్ కు వచ్చి హీరోయిన్ రష్మికను హీరో తీసుకుపోయే వ్యవహారం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కథ ప్రకారం ముందుకు సాగారు తప్ప సినిమా లో ఒక్కటంటే ఒక్క డ్యూయట్ కూడా పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ సూపర్ గా సాగిన సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త నీరసం తెప్పిస్తుంది. కెజీఎఫ్ సినిమా సక్సెస్ దగ్గర నుంచి బుల్లెట్ల వర్షం కురిపించే మెషిన్స్ ప్రతి సినిమాలో దర్శనం ఇస్తున్నాయి. ఇందులో కూడా హీరో రణబీర్ కపూర్ ఒక ఫైట్ అంతా దీనితోనే సాగుతుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే తండ్రీ, కొడుకులు పాత్రల మార్చుకునే సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాలో కొన్ని సంబాషణలు...సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. ఈ మూవీలో బాబీ డియోల్, పృథ్వి లు కీలక పాత్రలు పోషించారు. యానిమల్ సినిమా లో రణబీర్ కపూర్ యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటే...హింస కూడా శృతిమించి ఉంది అనే చెప్పాలి. యానిమల్ సినిమా తో వంగా సందీప్ రెడ్డి మరో హిట్ సాధించినట్లే.

రేటింగ్: 3 /5

Next Story
Share it