అల్లు శిరీష్...మళ్ళీ అదే కథ (Buddy Movie Review)
ఇక సినిమా కథ విషయానికి వస్తే హీరో అల్లు శిరీష్ పైలట్. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటిసి)లో పని చేస్తుంది. విమానాల ల్యాండింగ్ తో పాటు టేక్ ఆఫ్ విషయంలో ఏటిసి ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ ఏటిసి లో జాయిన్ అయిన తొలి రోజు శిరీష్ నడిపే ఫ్లైట్ లాండింగ్ కు అనుమతి ఇచ్చే విషయంలో ఒత్తిడికి గురి అవుతుంది. విషయం గ్రహించి పైలట్ కూల్ గా ఉండమని చెప్పి తన ఫ్లైట్ ను సాఫీగా ల్యాండ్ చేస్తాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. కానీ వీళ్లిద్దరు కలుసుకోకముందే ఆమె ను ఒక గ్యాంగ్ కోమాలోకి పోయేలా చేసి హాంగ్ కాంగ్ కు పంపిస్తుంది. ఆమెను హాంగ్ కాంగ్ ఎందుకు తీసుకువెళతారు. ఆ హీరోయిన్ ఆత్మ హీరో ఇచ్చిన టెడ్డీ బేర్ బడ్డీలోకి ఎలా వెళుతుంది. దీని వెనక ఉన్న అసలు కథ ఏంటి అన్నదే ఈ సినిమా.
అయితే ఇలాంటి స్టోరీ లైన్ తో తెలుగు ప్రేక్షకులు ఎన్నో సినిమాలు చూసి ఉన్నారు అనే చెప్పాలి. దీంతో అల్లు శిరీష్ కు బడ్డీ సినిమా మరో సారి నిరాశే మిగిలిచినట్లే లెక్క. కాస్తో కూస్తో ఈ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉంది అంటే ఆ టెడ్డి చేసే హంగామా మాత్రమే అని చెప్పాలి. అంతే తప్ప ఈ సినిమా స్టోరీలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు . అల్లు శిరీష్ పైలట్ గా తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ సినిమాలో ఎక్కువ భాగం కోమాలో ఉండి బెడ్ పైనే ఉంటుంది. హాంగ్ కాంగ్ లో ఒక హాస్పిటల్ అదినేతగా ఉన్న అజ్మల్ అమీర్ తన పాత్రకు న్యాయం చేశాడు. విలన్ క్యారెక్టర్ లో అజ్మల్ సీరియస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో విమానాల్లో వచ్చే ఫైట్ వెరైటీగానే ఉండి అని చెప్పొచ్చు. ముకేశ్ ఋషి హీరో బాబాయ్ గా కొత్త లుక్ లో సందడి చేశాడు. ప్రిషా రాజేష్ సింగ్, అలీ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా బడ్డీ సినిమా తో ఈ హీరో మరో సారి బోల్తా కొట్టాడు. గత సినిమాల తరహానే అల్లు శిరీష్ కు ఇది కూడా ఏదో ఒక సో సో సినిమా గానే మిగిలిపోతుంది.
రేటింగ్ : 2 /5